కార్పొరేషన్, జూలై 11: కరీంనగర్‌ను రాష్ట్రంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని 18వ డివిజన్ (రేకుర్తి)లో 1.90 కోట్లతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు మంగళవారం భూమిపూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. నగరంలో 60 ఏళ్లలో జరుగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతున్నదని వివరించారు. అన్ని మట్టి రోడ్లను సీసీ రోడ్లుగా మార్చుతున్నామని తెలిపారు. గత పాలకులు మట్టి రోడ్లను అస్సలు పట్టించుకోలేదని, సీసీ రోడ్లుగా మార్చాలనే కనీస సోయిలేకపోయిందని విమర్శించారు. కానీ, స్వరాష్ట్రంలో వందలాది కోట్లతో ప్రజలకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు.
నగరంలో విలీనమైన శివారు డివిజన్లను కూడా దశల వారీగా అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ముందు మంచినీటి సదుపాయం, డ్రైనేజీలు పూర్తి చేసిన తర్వాతే సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. అలాగే, శ్మశాన వాటికలను అభివృద్ధి చేసి, సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. డివిజన్లలో నెలకొన్న సమస్యలపై ఎప్పటికప్పుడు మేయర్, పాలకవర్గ సభ్యులు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగరంలో రోజూ తాగునీరు అందించే దిశగా పనులు సాగిస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత గొప్ప నగరంగా కరీంనగర్‌ను తీర్చిదిద్దేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజలు కూడా అభివృద్ధి పనులకు పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. నూతనంగా వెలుస్తున్న కాలనీల్లోనూ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్‌రావు, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు సుధగోని మాధవీకృష్ణాగౌడ్, ఎదుర్ల రాజశేఖర్, నాయకుడు గుగ్గిళ్ల శ్రీనివాస్, కార్పొరేటర్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో పురోగతి కనిపించాలి
కలెక్టరేట్, జూలై 11: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వారంలోగా పురోగతి కనిపించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన ఇంజినీరింగ్ శాఖ అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో డీఎంఎఫ్టీ, ఎస్డీఫ్, పీఆర్ ద్వారా తలపెట్టిన అభివృద్ధి పనుల్లో పురోగతి కనిపించాలని సూచించారు. టెండర్ ప్రక్రియ చేపట్టి, అగ్రిమెంట్ పూర్తి చేయాలని, బావుపేట గ్రామంలో రోడ్డుపై నీరు నిలిచి ఉండకుండా యుద్ధ ప్రాతిపదికన నీరు నిలిచి ఉండకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పనుల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని, ఇబ్బందులు తలెత్తినట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. తీగలగుట్టపల్లి నుంచి చేపట్టనున్న రోడ్డు అభివృద్ధి పనులకు గురువారం భూమి పూజ నిర్వహించనున్నట్లు తెలిపారు.
అపోలో దవాఖాన సమీపంలో రైల్వే లైన్ వద్ద ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మేయర్ వై సునీల్ రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సుబ్బారాయుడు, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ చల ్లస్వరూపారాణి-హరిశంకర్, మారెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖల ఈఈలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.