నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ మార్కెట్లో ధాన్యం విక్రయించుకున్న కొంత మంది మిల్లర్లు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అడ్డదారుల్లో వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ధాన్యం షిఫ్టింగ్‌కు పాల్పడాలని చూస్తుండగా.. ఈ వ్యవహారానికి ఆయా జిల్లాల అసోసియేషన్ నాయకులు కొందరు వంత పాడుతున్నట్లుగా తెలుస్తున్నది. ఇందు కోసం కొన్ని ఒప్పందాలు కుదుర్చుకొని. అనుమతులకోసం సంబంధిత అధికారులపై ఒత్తిడి పెట్టినట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం. అయితే.. విషయం బయటకు వస్తే తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని కొంత మంది అధికారులు అభ్యంతరం చెప్తుండగా.. ఎలా ఇవ్వరో చూస్తామంటూ వారిని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం కొనుగోళ్లు కొనసాగుతుండగా.. డిఫాల్ట్ మిల్లుల షిఫ్టింగ్ అనుమతుల కోసం ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ.. కొంత మంది మిల్లర్లే అసోసియేషన్ నాయకులను ప్రశ్నిస్తున్న తీరు ప్రస్తుతం హాట్‌టాఫిక్‌గా మారింది.
కరీంనగర్, జనవరి 12 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 22 శాతం మిల్లర్లు.. సీఎంఆర్ ధాన్యాన్ని అమ్ముకున్నట్లుగా గత కొంత కాలంగా ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై గతంలోనే ప్రభుత్వం పూర్తి వివరాలు అరా తీసింది. సీఎంఆర్ కింద తీసుకున్న ధాన్యం మేరకు.. నిర్ణీత వ్యవధిలో బియ్యం పెట్టకుండా బకాయి పడ్డ మిల్లులకు ఈసారి ధాన్యం ఇచ్చే ప్రశ్నేలేదని ప్రభుత్వం పేర్కొంది. ఆ మేరకు.. తదుపరి కొన్ని నిబంధనలను సవరించినా.. డిఫాల్ట్ అయిన మిల్లులకు మాత్రం ధాన్యం కేటాయింపులు లేవు. నిజానికి చాలా మంది మిల్లర్లు గతంలో వివిధ రకాల పైరవీల ద్వారా సామర్థ్యానికి మించి ధాన్యం కేటాయింపులు చేయించుకున్నారు. ఆ మేరకు.. బియ్యాన్ని ఎఫ్‌సీఐకి పెట్టాలి. కానీ, వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లే కొంత మంది విక్రయించుకున్నారు. అలాగే, కొంత మంది బియ్యాన్ని అమ్ముకున్నట్లుగా గతంలో జరిగిన టాస్క్‌ఫోర్స్ తనఖీల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో.. పలువురు మిల్లర్లను డిఫాల్టర్లుగా గుర్తించారు. నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలి.
డిఫాల్ట్ అయిన మిల్లుల యజమానులు తాము చేసిన తప్పులనుంచి బయట పడేందుకు ధాన్యం షిఫ్టింగ్ పేరుతో కొత్త మార్గాన్ని అన్వేషించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేటాయింపులు జరిగిన మిల్లుల నుంచి డిఫాల్ట్ అయిన మిల్లులకు ధాన్యం కేటాయింపులు జరిగేలా చూసి.. ఆ మేరకు బియ్యం పెట్టి.. డిఫాల్ట్ నుంచి బయట పడాలని చూస్తున్నట్లు సమాచారం. అలా జరిగితే, ఈ ఖరీఫ్ ధాన్యం తిరిగి వచ్చే జనవరి వరకు పెట్టుకునే అవకాశం సదరు మిల్లులకు కలుగుతుంది. దీని ద్వారా సదరు మిల్లులు లబ్ధిపొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇందులో భాగంగానే.. సదరు డిపాల్ట్ మిల్లులకు.. ధాన్యం షిఫ్టింగ్ చేసుకునేందుకు కొంత మంది మిల్లర్లు అసోసియేషన్లను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఆ మేరకు అసోసియేషన్‌లోని కొంత మంది నాయకులు.. డిఫాల్ట్ మిల్లులతో అంతర్గత ఒప్పందాలు చేసుకొని.. షిఫ్టింగ్ అనుమతులకోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. ఉమ్మడి జిల్లాలోని రెండు జిల్లాల్లో ఇందుకు సంబంధించి ఫైల్‌ను మూవ్ చేయడానికి శత విధాలా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అయితే.. ఈ అనుమతులు ఇవ్వడానికి కొంత మంది అధికారులు నిరాకరిస్తుంటే.. “ఎలా ఇవ్వరో చూస్తాం” అంటూ కొంత మంది అసోసియేషన్ నాయకులు బెదిరింపులకు దిగుతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ఈ సీజన్లో కొనుగోళ్లు ఈనెల 31 వరకు కొనసాగిస్తామని ఇటీవలే పౌరసఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఏ పరిస్థితుల్లోనూ సింగిల్ షిఫ్టింగ్ కూడా చేయడానికి వీలు లేదని తెలుస్తోంది. ఈ నిబంధనలను కాదని అధికారులు అనుమతులు ఇస్తే.. సదరు అధికారులపై ప్రభుత్వం వేటువేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని వారు భయపడుతున్నారు. అయితే.. ఏ పరిస్థితుల్లోనైనా షిఫ్టింగ్‌కు అనమతులు సాధించాలని కొంత మంది నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. కాగా.. ఒకవైపు కొనుగోళ్లు సాగుతున్న తరుణంలో షిఫ్టింగ్ కోసం మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు ఎలా ప్రయత్నాలు చేస్తారంటూ.. కొంత మంది మిల్లర్స్ యజమానులు సదరు అసోసియేషన్ నాయకులను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అంతే కాదు.. నిబంధనలను విస్మరించిన మిల్లర్లకు అండగా అసోసియేషన్స్ ముందుకు వెళ్లడం భావ్యం కాదని, ఇందుకోసం అధికారులపై ఒత్తిళ్లు తేవడం వల్ల.. మిగిలిన వారిపై ఆ ప్రభావం పడుతుందని కొంత మంది మిల్లర్లు అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో మిల్లర్స్ అసోసియేషన్‌లో ప్రస్తుతం ఇదో హాట్‌టాపిక్‌గా మారగా.. అధికారులు నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గుతారా? లేక నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తారా? అన్నది రెండు మూడు రోజుల్లో తేలనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.