గంగాధర, ఏప్రిల్ 4 : అన్ని వర్గాలకు మంచి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను మరచిపోవద్దని, మరోసారి అండగా ఉండాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విజ్ఞప్తి చేశారు. మహిళలు, రైతులు, దళితులు ఇలా సబ్బండవర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి ఎన్నోపథకాలు తెచ్చి అమ లు చేస్తున్నారని, ఇంటింటికీ సంక్షేమ ఫలా లు అందిస్తున్నారని కొనియాడారు. కానీ, బీజేపీ కులం, మతం పేరిట రాజకీయాలు చేయడం తప్ప ప్రజా సంక్షేమం కోసం ఒక్క పథకాన్నైనా తెచ్చిందా అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఉపాధిహామీని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నదని మండిపడ్డరు. గంగాధర మండలం బూరుగుపల్లిలో చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాల ఉపాధిహామీ సిబ్బందితో మంగళవారం ఆత్మీయ సమ్మేళ నం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడారు.
గ్రామాల అభివృద్ధిలో ఉపాధి సిబ్బంది పాత్ర కీలకమని చెప్పారు. ఉపాధిహామీ, ఆధునిక వైకుంఠధామం మొదలుకుని సెగ్రిగేషన్ షెడ్డు వరకు, పల్లె ప్రకృతి వనం నుంచి గ్రామీణ క్రీడా ప్రాంగణం వరకు వారి భాగస్వామంతో పనులు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్ర సర్కారు ఉపాధి హామీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నదని స్పష్టం చేశారు. కానీ, బీజేపీ ఉపాధి సిబ్బంది, కూలీల పొట్టగొట్టేందుకు ప్రయత్నిస్తున్నదని ధ్వజమెత్తారు. వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎకరానికి 10 వేల ఆర్థిక సాయం ప్రకటించారని, ఇది దేశచరిత్రలోనే మొదటిసారి అని చెప్పారు. ఎంతో ఉదారతతో సాయం ప్రకటిస్తే.. అందులోనూ కేంద్రం వాటా ఉందని బీజేపీ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రానున్నది ఎన్నికల సమయమని, కొత్త బిచ్చగాళ్లు పొద్దెగనట్లు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకి వచ్చి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తుంటారని, వారి అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నా యా..? అని ప్రశ్నించారు. గ్రామాలకు వచ్చే నాయలకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉపాధిహామీ సిబ్బంది సీఎం కేసీఆర్ కటౌట్‌కు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆరు మండలాలకు చెందిన ఏపీవోలు, టీఏలు, ఈసీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.