జగిత్యాల గులాబీమయమైంది. యుద్ధానికి వెళ్లే సైనికుల్లా ఉరకలు వేస్తూ వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులతో కిటకిటలాడింది. జిల్లా కేంద్రం శివారులోని చల్గల్ మార్కెట్ యార్డులో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గ్రాండ్ సక్సెస్ అయింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకే యార్డు ఆవరణ వేలాది మందితో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత దిశానిర్దేశం చేయడంతో జోష్ నిండింది. ఇటు అతిథులు మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, డాక్టర్ మాకునూరు సంజయ్ కుమార్, మాజీ మంత్రి రాజేశంగౌడ్ తమ ప్రసంగాలతో ఆకట్టుకోగా, శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. మళ్లీ జగిత్యాల నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర ఖాయమనే ధీమా కనిపించింది.
– జగిత్యాల, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ)
ఆత్మీయ సమ్మేళనానికి వేలాదిగా తరలివచ్చిన మీ అందరినీ చూస్తుంటే బీఆర్ఎస్ గెలుపు ఖాయమనిస్తున్నది. మళ్లీ ఈ గడ్డపై నుంచే జైత్రయాత్ర ప్రారంభమవుతుందని అనిపిస్తున్నది. తొమ్మిదేండ్లుగా బీఆర్ఎస్ ప్రజారంజక పాలన సాగిస్తున్నది. కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజ్వరాయర్లే కాదు, కైండ్ హార్టెడ్ కమిటెడ్ రెస్పాన్స్‌బుల్ లీడర్. ఆయన సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నది. కానీ, కాంగ్రెస్ పార్టీ రాష్ర్టానికో విధానం అనుసరిస్తూ డిక్లరేషన్ల పేరిట దగా చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో మాయమాటలు చెప్పి మోసగించాలని చూస్తున్నది. ప్రజలెవరూ ఆ పార్టీ నాయకులను నమ్మద్దు. బీఆర్ఎస్ను గెలిపిస్తేనే జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి మరింత సాధ్యమవుతుంది. నిరంతరం ప్రగతి కోసం తపిస్తూ ప్రజాక్షేత్రంలో ఉండే ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌ను రెట్టింపు మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మీపై ఉన్నది.
– జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జగిత్యాల, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ): జగిత్యాల గులాబీమయమైంది. నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికే వేలాదిగా కార్యకర్తలు తరలిరావడంతో సమావేశ ప్రాంగణమంతా కోలాహలంగా మారిపోయింది. ఎటు చూసినా వాహనాలు, ఏ వైపు నుం చి చూసినా జనం గులాబీ జెండాలు చేతబూని, కండువాలతో కదిలిరావడంతో సమావేశ ప్రాంగణం కిటకిటలాడింది. ఈ మీటింగ్ ఐదు నెలల క్రితం పద్మనాయక కల్యాణ మండపంలో ఏర్పాటు చేసినప్పటికీ, మరో రెండు గంటల్లో ప్రారంభమవుతుందన్న సమయంలోనే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కౌన్సిలర్ భర్త బండారి నరేందర్ గుండెపోటుతో చనిపోవడంతో వాయిదా పడింది. ఐదు నెలల తర్వాత జగిత్యాల సంజయ్‌కుమార్ జగిత్యాల పట్టణ శివారులోని చల్గల్ మార్కెట్ యార్డులో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
బుధవారం ఉదయం నుంచే నియోజకవర్గంలోని రాయికల్, బీర్పూర్, సారంగాపూర్, జగిత్యాల రూరల్, జగిత్యాల అర్బన్ మండలాల నుంచి కార్యకర్తలు వాహనాలు, బైకుల ద్వారా సమావేశ స్థలానికి బయల్దేరి వచ్చారు. జగిత్యాల మున్సిపాలిటీలోని బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బైక్‌లు, కార్లల్లో చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు మార్కెట్ కమిటీలోని రెండు హాల్స్ నిండిపోయాయి. దాదాపు పదివేల మంది తరలిరావడంతో సమావేశం పూర్తిగా కిక్కిరిసిపోయింది. నాయకులు మాట్లాడే హాల్ ఒకటి కావడం, మరో హాల్ మొత్తం జనంతో నిండిపోవడంతో అక్కడ రెండు పెద్ద స్క్రీన్స్‌ను ఏర్పాటు చేశారు. మొదటి హాల్లో నాయకులు చేసే ప్రసంగాలను రెండో హాల్లో కార్యకర్తలు కూర్చొని స్క్రీన్స్ చూశారు. కాగా, మంత్రి కొప్పుల ఈశ్వర్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. ‘సమావేశానికి వస్తుంటే రోడ్డుపై బారులుగా, జెండాలు చేతబూని ఉత్సాహంగా తరలివస్తున్న శ్రేణులను చూస్తే యుద్ధానికి వెళ్లే సమయంలో సైనికులను చూసినట్లుగా అనిపిస్తోందని పేర్కొనగా, కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలు వేసింది. చప్పట్లతో జయజయధ్వానాలు చేశారు.
జగిత్యాల, సెప్టెంబర్ 13: కాంగ్రెస్ రాష్ట్ర స్పోక్స్ పర్సన్ జగిత్యాలకు చెందిన కచ్చు హరీశ్ బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్సీ కవిత పుష్పగు చ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అలాగే నర్సింగాపూర్‌కు చెందిన బీజేపీ మండల నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, సారంగాపుర్ మండల అర్పపల్లికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండబెట్ల గాబ్రియేల్తోపాటు 100 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
ఎమ్మెల్సీ కవిత ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకున్నది. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. ‘కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లే కాదు.. కైండ్ హార్టెడ్ కమిటెడ్ రెస్పాన్స్‌బుల్ లీడర్’ అంటూ కొత్త నిర్వచనాన్ని ఇవ్వడంతో సభలో ఉత్సాహం వ్యక్తమైంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ను విమర్శిస్తూ, వారి పాలిత రాష్ర్టాల్లో పింఛన్లు ఇవ్వకుండా ఇక్కడ ఇస్తామన్న డిక్లరేషన్ల ప్రకటనపై మండిపడ్డారు. ‘తల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నట్లు ఉంది’ అనడంతో సభలో నవ్వులు విరిశాయి. మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటు, ఇతర కీలక అంశాలపై కాంగ్రెస్‌కు ఒక వైఖరి లేదంటూ విమర్శిస్తూ, జాతీయ రాజకీయాలను ప్రస్తావించి అందరినీ ఆలోచనల్లో పడేశారు. మైనార్టీ వర్గాలకు సంబంధించిన పథకాలపై ఉర్దూలోనే ప్రసంగించి ఆకట్టుకున్నారు.
తొమ్మిదిన్నరేండ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి కార్యకర్త ఇంటింటా వివరించాలని, గ్రామాల్లో, కాలనీల్లో చర్చ పెట్టాలని, ఫేస్బుక్, వాట్సప్‌ల్లోనూ వివరించాలంటూ శ్రేణులకు మార్గదర్శనం చేశారు. చివరగా రామాయణంలోని ఒక అంశాన్ని రాజకీయాలకు వర్తింపజేస్తూ ప్రసంగాన్ని ముగించారు. రామ రావణ యుద్ధంలో గెలిచిన తర్వాత రాముడు మిగిలిన కొందరు రాక్షసులను వదిలివేశాడంటా, అలాగే చనిపోయిన కొందరు రాక్షసులను సైతం బతికించమని రాముడు వేడుకోవడంతో దేవుడు కరుణించి వారిని బతికించాడంటా.. అయితే చచ్చిబతికిన రాక్షసులు, మిగిలిన రాక్షసులు ‘మమ్మల్ని బతికించావు గానీ మాకు నాయకుడు లేడు కదా..? ఎట్లా అంటే..? ఏం లేదు. మీరంతా కాంగ్రెస్ నాయకులుగా పుడుతారని చెప్పాడటా. లంక రాక్షసుల సంతంటే కాంగ్రెస్ వారు అంటూ హాస్యపూర్వకంగా వివరించే ప్రయత్నం చేశారు. దాదాపు 30 నిమిషాల పాటు సాగిన కవిత ప్రసంగం ఆద్యంతం కార్యకర్తలను ఆలోచింపజేయడంతో పాటు, కార్యోన్ముఖుల్ని చేసింది.