భూతల్లి ఒడిలో పనిచేస్తూ.. నల్లబంగారాన్ని వెలికి తీసే నల్ల సూర్యులు, వారి కుటుంబాల ఆరోగ్యం విషయంలో సింగరేణి యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రమాదపుటంచున పనిచేస్తూ, ఉ్యదోగ విరమణ తర్వాత అనేక జబ్బులతో సతమతమవుతున్నా అశ్రద్ధ చూపుతున్నది. దీంతో కార్మికులు, వారి కుటుంబసభ్యులు ఇబ్బంది పడాల్సి వస్తున్నది
పెద్దపల్లి, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : సింగరేణి భద్రాద్రి జిల్లా కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో విస్తరించింది. 24 భూగర్భ గనులు, 18 ఉపరితల గనులు మొత్తంగా 42 గనులను కలిగి ఉంది. దాదాపుగా 40 వేల మంది వరకు ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు పనిచేస్తున్నారు. మరో 25 వేల మంది కాంట్రాక్టు కార్మికు లు ఉన్నారు. ఇలా ఉద్యోగంలో ఉన్న వారి ద్వారా స్వ యంగా దాదాపుగా 2 లక్షల మంది వరకు ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. అలాగే ఉద్యోగ విరమణ పొందిన దాదాపుగా 1.60లక్షల మందికి సంబంధించిన మరో 4లక్షల వరకు జనాభా సింగరేణిపై ఆధారపడి జీవిస్తున్నది.
రాష్ట్రం లో ఏ కంపెనీకి లేనన్ని కార్మిక కుటుంబాలను కలిగి ఉన్న సింగరేణి సంస్థ, లాభాల బాటలో పయనిస్తుండడంతో పాటు సామాజిక బాధ్యతతో చాలా మందికి అనేక రకాల ప్రయోజనాలను కల్పిస్తున్నది. కానీ, తమ సొంత కార్మికులు, వారి కుటుంబాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నదనే అపవాదును మూటగట్టుకుంటున్నది. సింగరేణి వ్యాప్తంగా తమ కార్మికుల వైద్య సాయం కోసం ఆరు జిల్లాల్లో 6 ఏరియా దవాఖానలతోపాటు 21 డిస్పెన్సరీలు, కొత్తగూడెంలో ప్రధాన దవాఖానను ఏర్పాటు చేసినప్పటికీ వైద్య సేవల్లో మాత్రం నిర్లక్ష్యమే చేస్తున్నదని చెప్పాలి. ఏటా దాదాపుగా 35కోట్ల నుంచి 40కోట్ల వరకు మందులను కొనుగోలు చేస్తున్నప్పటికీ అవి సరిపోవడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వానికే అనేక రకాల అభివృద్ధికి నిధులను వెచ్చిస్తున్న సింగరేణి అసలు కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నది. వారి ఆ రోగ్యం కోసం ఖర్చు చేయడానికి వెనుకాడుతున్నది. సింగరేణి కార్మికుల వైద్య సేవలకు ఒక్కటంటే ఒక్క సూపర్ స్పెషాలిటీ దవాఖానను కూడా నిర్మించకుండా ప్రైవేటుగా దాదాపు 150 సూపర్ స్పెషాలిటీ దవాఖానలకు ఎంప్యానల్ మెంట్ ఇచ్చి పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సూపర్ స్పెషాలిటీ దవాఖానల ద్వారా ఒక వైపు సింగరేణి నిధులు ఖర్చు అవుతుండగా.. మరో వైపు కార్మికులను సైతం ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు.
సింగరేణి నిర్వహిస్తున్న 21 డిస్పెన్సరీలు, 6 ఏరియా దవాఖానల్లో కనీసం క్రానిక్ డిసీజస్కు సంబంధించిన మందులు కూడా అందుబాటులో లేవు. దీంతో బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి జబ్బులకు మందులు లేక నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రతి నెలా ఈ క్రానిక్ డిసీజెస్‌కు సంబంధించిన మందులు వాడే వారిలో ప్రస్తుత సింగరేణి కార్మికులతోపాటు రిటైర్డ్ కార్మికుల కుటుంబాల వారు సైతం ఉంటారు. ఇంకా అనేక రకాల మందులు సైతం సింగరేణి దవాఖానలో అందుబాటులో లేవు.
సింగరేణి సంస్థ వద్ద నిధులు ఉన్నా మందుల కొనుగోలులో జాప్యం కారణంగా కార్మికులు, వారి కుటుంబాలకు ప్రాణాంతకంగా మారింది. దవాఖానకు వచ్చిన కార్మికు లు, వారి కుటుంబ సభ్యులు మందులు అందుబాటులో లే క నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఏవైతే మందులు అందుబాటులో లేవో అలాంటి వాటిని స్థానికంగా కొనుగోలు చేస్తున్నప్పటికీ అవి సరిపోవడం లేదు. ఏరియా దవాఖానల్లో సరిపడా మందులు లేక పోవడంతో రిటైర్డ్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిటైర్డ్ కార్మికులు తమ ఉద్యోగ విరమణ పూర్తి కాగానే ఎక్కడెక్కడో స్థిరపడి పోతారు.
అనారోగ్య సమస్యలతో ఏరియా దవాఖానలకు వచ్చి పరీక్షలు చేయించుకొని మందులు తీసుకుంటారు. అలాంటి వారు కూడా మందులు లేక తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. కనీసం స్టాక్ అందుబాటులో లేదనే సమాచారం ముందుగా ఇచ్చేవారు కూడా లేరు. మార్చిలోనే రావాల్సిన మెడిసిన్ అందుబాటులోకి రాకపోవడంతో ఈ తిప్పలు తప్పడం లేదు. మే 15ననే టెండర్ల ప్రక్రియ పూర్తికాగా ఇప్పటికే మందుల సరఫరా జరగాలి. కానీ, ఇంకా ఏయే వ్యవహారాలు పెండింగ్‌లో ఉన్నాయో ఏమో కానీ, మందుల సరఫరా మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు.
ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి మందులకు టెండర్లు పిలుస్తాం. ఇప్పుడు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలోనే మందుల కొరత సమస్య తీరుతుంది. కార్మికులు, కార్మికుల కుటుంబాలు, కార్మిక సంఘాలు ఎవరూ ఆందోళన చెందవద్దు. ఆర్డర్లు ఇచ్చేశాం. మందులు వస్తాయి. మందలకు సరిపడా బిల్లుల పేమెంట్ కూడా చేశాం. ఈ కొద్ది రోజులు అడ్జస్ట్ మెంట్ చేసుకోవాలి. మళ్లీ తిరిగి పుష్కలంగా మందులు వస్తాయి. ఆందోళన చెందొద్దు.
– కిరణ్‌రాజ్‌కుమార్, చీఫ్‌మెడికల్ ఆఫీసర్ (కొత్తగూడెం)
మందుల కోసం ఇక్కడిదాకా వచ్చినం. కానీ, ఇక్కడ ఓటుంటే ఓటి లేదు. కనీసం బీపీ గోలీలు కూడా లేవు. 40 ఎంజీకి బదులు 20 ఎంజీ గోలీలు ఇస్తున్నారు. నెల రోజులకు బదులు పది రోజులకు మందులు ఇస్తున్నారు. సిబ్బందిని అడిగితే వెళ్లి తెచ్చుకోండి అంటున్నరు. ఇక్కడికి వస్తే ఇట్లంటున్నరు. అన్ని మందులు అందుబాటులో ఉంచాలె. మల్ల మల్ల రాకుంటా చూడాలె.
-అన్వర్‌పాషా, జనరల్ మజ్దూర్ (ఐకే-1ఏ శ్రీరాంపూర్)
నాకు ఫిట్స్ ఉంది. అది రాకుండా ఉండేటందుకు రక్తం గడ్డకట్టకుండా గోలీలు ఇస్తరు. అవి లేవంటున్నరు. పక్షవాతానికి గోలీలు ఉంటయి. అవీ లేవంటున్నరు. అన్ని గోలీలలను దావఖన్ల ఉంచాలే. మా బాధలు ఎవలకు జెప్పుకోవాలే. అన్ని జేత్తన్నం అంటరు గీ గోలీలే సక్కగ ఇత్త లేరు.
– లక్ష్మణ్, రిటైర్డ్ కార్మికుడు (గోదావరిఖని)