కరీంనగర్ జిల్లాలో జనరల్ (సాధారణ) మెడిసిన్ దందా విచ్చలవిడిగా సాగుతున్నది. నెలకు 500 కోట్ల మీదనే జరుగుతున్న ఈ వ్యాపారంలో స్టాండర్డ్ (ప్రామాణిక) మెడిసిన్ ఎక్కడో వెనుకబడి పోయింది. నెలకు 100 కోట్లతో సరిపెట్టుకుంటుండగా, జనరల్ మెడిసిన్ టర్నోవర్ మాత్రం 400 కోట్లకుపైగా ఉంటున్నట్టు తెలుస్తున్నది. కొందరు వైద్యుల సహకారంతో ఈ వ్యాపారం రోజురోజుకూ విస్తరిస్తున్నది. లెక్కా పత్రం లేకుండా పూర్తిగా జీరో దందా జరుగుతున్నా కొన్ని శాఖల అధికారులు చోద్యం చూస్తుండడం విమర్శలకు తావిస్తున్నది. అసలు ఈ మందులు ఎంత వరకు నాణ్యమైనవనేది పరీక్షించే నాథుడే లేకుండా పోగా, కోట్లలో జీఎస్టీ ఎగవేస్తుండడంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి పడుతున్నది.
కరీంనగర్, జూలై 14 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : టాగ్జిమ్ ఇది ఒక యాంటీబయాటిక్ మెడిసిన్. స్టాండర్డ్ కంపెనీల ద్వారా మార్కెట్లోకి వచ్చిన ఈ మెడిసిన్ ధర ఎక్కువే. 100 టాబ్లెట్స్‌కు 1,640కి విత్ జీఎస్టీతో లభిస్తున్నది. మార్కెటింగ్ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్లకు ఈ మందును 8 శాతం మార్జిన్‌తో కంపెనీలు అందిస్తున్నాయి. ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్లు మెడికల్ దుకాణాలకు 6 శాతం మార్జిన్‌తో ఇస్తుంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 12 శాతం జీఎస్టీ కూడా చెల్లిస్తుంటాయి.
ఇదే ఫార్ములాతో జనరల్ మెడిసిన్ తయారు చేస్తున్న కొన్ని నాన్ మార్కెటింగ్ కంపెనీలు అవే 100 టాబ్లెట్స్‌కు 650 నుంచి 700కే మెడికల్ షాపులకు, కొందరు వైద్యులకు అందిస్తున్నాయి. ఒక యాంటీబెటిక్ స్టాండర్డ్ కంపెనీలవి 100 మాత్రలు 1,100కు లభిస్తుంటే జనరల్ మెడిసిన్‌లో అవే మాత్రలు 180 నుంచి 190కే లభిస్తున్నాయి. వీటిపై ప్రభుత్వానికి ఎలాంటి జీఎస్టీ చెల్లించరు. స్టాండర్డ్ కంపెనీలకు పై నుంచి కింది వరకు ప్రొడక్షన్, మార్కెటింగ్ వింగ్‌లు పని చేస్తుంటాయి.
కానీ, జనరల్ మెడిసిన్‌కు మాత్రం ఊరూ పేరు లేని తీరుగా ఎవరో కొందరు తెచ్చి విక్రయించి వెళ్తుంటారు. కరీంనగర్ జిల్లాలో స్టాండర్ట్ కంపెనీల మందులు విక్రయించే ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటరీలు సుమారు 250 వరకు ఉన్నాయి. అదే విధంగా జనరల్ మెడిసిన్‌కు సంబంధించిన ఏజెన్సీలు అంతకంటే తక్కువగా సుమారు 150 మాత్రమే ఉన్నట్లు తెలుస్తున్నది. కానీ, స్టాండర్ట్ కంపెనీల కంటే జనరల్ మెడిసిన్ విక్రయించే నాన్ మార్కెటింగ్ ఏజెన్సీల వ్యాపారమే జిల్లాలో పెద్ద మొత్తంలో నడుస్తున్నది.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈ రెండు రకాల ఏజెన్సీలే కాకుండా సర్జికల్, జనరిక్ మెడిసిన్స్ అమ్మకాలు నెలకు 500 కోట్లకుపైగా టర్నోవర్ అవుతున్నట్టు ఒక అంచనా. అందులో ప్రభుత్వాలకు జీఎస్టీ చెల్లించే స్టాండర్డ్ కంపెనీలు కేవలం 100 కోట్ల వ్యాపారం చేస్తుండగా, మిగతావి 400 కోట్లకుపైగా వ్యాపారం సాగిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నది. జనరల్ మెడిసిన్ విక్రయదారులు ఎలాంటి జీఎస్టీ చెల్లించకుండానే ఇంత పెద్ద మొత్తంలో వ్యాపారం సాగిస్తున్న తీరు ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.
జీఎస్టీ ఎగవేస్తూ జీరో వ్యాపారం
ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్న జనరల్ మెడిసిన్ దందా పూర్తిగా జీరో బిజినెస్‌గా స్పష్టమవుతున్నది. వీటిలో నాణ్యతా ప్రమాణాలు ఎంత వరకు ఉన్నాయనేది పరిశీలించే వ్యవస్థ లేదు. విచ్చలవిడిగా వ్యాపారాలు సాగిస్తున్న మెడికల్ మాఫియా ఎవరికీ అంతు చిక్కని విధంగా ఈ దందా సాగిస్తున్నది. అయితే అనేక మెడికల్ షాపుల్లో ఒక్కరు కూడా జీఎస్టీ బిల్లు అడిగే పరిస్థితి లేదు.
ఇచ్చే పరిస్థితి కూడా లేదు. రోగులు ఎంత సేపు తమకిచ్చే డిస్కౌంట్పైనే దృష్టి పెడుతున్నారు. ఈ వీక్నెస్ తెలిసిన మెడికల్ షాపుల నిర్వాహకులు పెద్ద మొత్తంలో డిస్కౌంట్లు ఆఫర్ చేస్తూ జనరల్ మెడిసిన్ విక్రయిస్తున్నారు. మెడిసిన్‌ను బట్టి 5, 12,18 శాతం జీఎస్టీ అమ్మకాలపై విధిస్తుంటారు. కానీ, ఎక్కడ కూడా జీఎస్టీ బిల్లులు ఇవ్వరు. దీని వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం పెద్ద మొత్తంలో ఆదాయానికి గండి పడుతున్నది. స్టాండర్డ్ కంపెనీలు మొదలుకొని జనరల్, సర్జికల్, జనరిక్ మందులపైనా జీఎస్టీ విధించే అవకాశం ఉంటుంది.
కానీ, ఈ మందులు ముఖ్యంగా జనరల్ మందులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మార్కెటింగ్ చేసేది ఎవరనేది ఎవరికీ తెలియదు. ఫలితంగా కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు ట్యాక్స్‌లు వసూలు చేసే పరిస్థితి ఉండదు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నెలకు 500 కోట్లకుపైగా వ్యాపారం సాగుతుంటే, స్టాండర్డ్ కంపెనీలకు చెందిన 100 కోట్లపైనే జీఎస్టీ వస్తున్నట్లు తెలుస్తున్నది. మిగతా 400 కోట్ల జనరల్ మెడిసిన్‌పై ఎలాంటి జీఎస్టీ రావడం లేదని స్పష్టమవుతున్నది.
ఈ లెక్కన ఏడాదిలో ఒక్క జనరల్ మెడిసిన్ దందానే 4వేల నుంచి 5 వేల కోట్ల వ్యాపారం జరుగుతున్నట్టు తెలుస్తుండగా ఎంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఇటు జనరల్ మెడిసిన్‌లో నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయా.. లేవా..? అనేది పరిశీలించేందుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం లేకపోవడంతో మెడికల్ మాఫియా రెచ్చిపోతున్నది.
యథేచ్ఛగా జనరల్ మెడిసిన్ వ్యాపారం
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో జనరల్ మెడిసిన్ దందా యథేచ్ఛగా సాగుతున్నది. వీటి ధాటిని స్టాండర్డ్ మెడిసిన్ తయారీ కంపెనీలు కూడా తట్టుకోలే కపోతున్నాయి. కరీంనగర్‌లోని అనేక మంది వైద్యులు జనరల్ మెడిసిన్‌నే ఎక్కువగా రాస్తున్నారు. తాను ఎండీ పట్టభద్రున్నని చెప్పుకొంటున్న ఓ డయాబెటాలజిస్ట్ నాన్ మార్కెటింగ్ కంపెనీలకు ప్రత్యేకంగా ఆర్డర్లు ఇచ్చి జనరల్ మెడిసిన్ తయారు చేయించుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఆ డాక్టర్ రాసిన మందులు కేవలం ఆయన మెడికల్ షాపులోనే మాత్రమే దొరుకుతాయి. బయట ఎక్కడి మెడికల్ షాపులో ఇవి అందుబాటులో ఉండవు.
ఒక ఈఎన్టీ వైద్యుడు, ఒక కంటి వైద్యుడు ఇలా ఒక్కో ప్రత్యేక నిఫుణులు వారికి కావాల్సిన మందులను తయారు చేయించుకొని కేవలం వారి దవాఖానలకు అనుబంధంగా ఉన్న మెడికల్ షాపుల్లో మాత్రమే వీటిని విక్రయిస్తున్నట్టు తెలుస్తున్నది. నాన్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నేరుగా వస్తున్న మందులకు మార్జిన్ ఎక్కువగా లభిస్తుంది. కానీ, రోగులకు మాత్రం మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించే ఎంఆర్పీ ధరకు విక్రయిస్తున్నారు. ఇలాంటి మందులపైనే ఎక్కువ మొత్తంలో డిస్కౌంట్లు ఇస్తున్నారు. డిస్కౌంట్ ఎక్కువ వస్తున్నదని భావిస్తున్న రోగులు, వీటి నాణ్యతా ప్రమాణాల గురించి అసలు ఆలోచించే పరిస్థితి కనిపించడం లేదు.
20 లక్షలు దాటితేనే జీఎస్టీ పరిధికి
మెడికల్ దందాలో ఉన్న మరో వెసులుబాటును చాలా మంది మెడికల్ షాపుల నిర్వాహకులు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. అదేమిటంటే ఏడాదికి 20 లక్షల టర్నోవర్ దాటితేనే ఆ దుకాణాలు జీఎస్టీ పరిధిలోని వస్తాయి. ఒక్క నెలలోనే ఇంతకంటే ఎక్కువ టర్నోవర్ అవుతున్న మెడికల్ దుకాణాలు వందల సంఖ్యలో ఉన్నాయి. కానీ, కమర్షియల్ టాక్స్ అధికారుల కళ్లు గప్పి అంతకంటే తక్కువ టర్నోవర్ చూపే మెడికల్ షాపుల సంఖ్యనే ఎక్కువ. తాము కొన్న మందులపై జీఎస్టీ బిల్లులు తీసుకోవాలనే ఆలోచన రోగులకు రాకుండా మెడికల్ దుకాణాల నిర్వాహకులు జనరల్ మందులపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నారు.
జీఎస్టీ పరిధిలోకి వచ్చే మెడికల్ దుకాణాల్లో కూడా జీఎస్టీ చెల్లింపుల్లో అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. నెలలో లక్షల్లో టర్నోవర్ జరుగుతున్నా వందలు వేలల్లో విక్రయాలు జరిగినట్లు తామే జీఎస్టీ బిల్లులు సృష్టించి కమర్షియల్ టాక్స్ అధికారులకు సమర్పిస్తుంటారు. ‘సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం’ అన్నట్టు సదరు శాఖ అధికారులు కూడా జీఎస్టీ వచ్చిందా.. లేదా..? అని మాత్రమే చూస్తున్నారు. వ్యవస్థ ఈ రకంగా ఉన్న తర్వాత ఎవరేమీ చేయలేని పరిస్థితి కనిపిస్తున్నది.