గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ(Gujarat Assembly)కి ఇవాళ బాంబు బెదిరింపు వచ్చింది. ఈ మెయిల్ ద్వారా ఆ బెదిరింపు చేశారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఇవాళ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ఈ మెయిల్ వచ్చినట్లు తెలిసింది. అంసెబ్లీ కాంప్లెక్స్‌లో బాంబును అమర్చినట్లు బెదిరింపులో పేర్కొన్నారు. దీంతో అసెంబ్లీ లో ఉన్న సిబ్బంది, ఎమ్మెల్యేలను పరిసర ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. డిప్యూటీ ఎస్పీ పీయూష్ వందా ఈ విషయాన్ని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నది. కానీ ఉదయం 8.45 నిమిషాలకు బాంబు బెదిరింపు మెసేజ్ వచ్చిందన్నారు. బాంబు బెదిరింపు సమాచారం రావడంతో.. పోలీసులు అసెంబ్లీకి వచ్చి పేలుడు పదార్ధాల కోసం సోదాలు మొదలుపెట్టారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి అనుమానిత వస్తువును గుర్తించలేదన్నారు.