LPG Crisis | పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా దేశంలో తలెత్తిన ఎల్పీజీ (LPG) సరఫరా ఇబ్బందులపై బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించిన ‘ముంబై క్లీన్ లీగ్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గ్యాస్ సిలిండర్ల కొరతను అధిగమించేందుకు తన భార్య ట్వింకిల్ ఖన్నా ఇప్పటికే జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతానికి తమ ఇంట్లో గ్యాస్ కొరత లేనప్పటికీ, ముందు జాగ్రత్తగా ఆమె రెండు ఇండక్షన్ స్టవ్‌లను ఆర్డర్ చేశారని, సామాన్యులు కూడా ప్రత్యామ్నాయంగా ఇండక్షన్లు కొనుగోలు చేయడం మంచిదని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. అక్షయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు, అంతర్జాతీయ ఇంధన సరఫరా ఇబ్బందులు సామాన్యులపై ప్రభావం చూపకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి స్పష్టం చేశారు. ఎల్పీజీ విషయంలో ప్రస్తుతం ఎటువంటి తీవ్రమైన ఆందోళన అవసరం లేదని, పశ్చిమ ఆసియాలోని హార్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని ఇప్పటికే 36 శాతం పెంచామని, గ్యాస్ సిలిండర్ల హోర్డింగ్ మరియు బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయని అధికారులు వెల్లడించారు.