కార్పొరేషన్, జూన్ 11: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందిస్తున్నామని నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు పేర్కొన్నారు. మంగళవారం డ్యాం సమీపంలోని ఫిల్టర్‌బెడ్‌ను ఆయన సందర్శించారు. 84 ఎంఎల్డీ ఫిల్టర్‌బెడ్‌లో నీటిశుద్ధి ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, వర్షకాలంలో కొత్త నీరు వస్తుందని, నీటి శుద్ధీకరణలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నగరంలో ఎక్కడా కూడా నీటి సరఫరాలో అంతరాయం కలుగకుండా స్టాండ్ బై మోటర్లు, జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
దేశంలోనే ప్రతిరోజూ మంచినీటి సరఫరా చేస్తున్న నగరం కరీంనగర్ మాత్రమేనని పేర్కొన్నారు. వర్షకాలంలో డ్యాంలోకి ఎనిమిది టీఎంసీల నీరు వచ్చిన వెంటనే ప్రతిరోజూ మంచినీటి సరఫరా ప్రారంభిస్తామన్నారు. నీటి శుద్ధీకరణలో 2 పీపీఎం పాటిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ల్యాబ్‌లో నీటి నాణ్యతను పరిశీలిస్తున్నామని చెప్పారు. విద్యుత్ సమస్యలు వచ్చినా నీటి శుద్ధీకరణలో సమస్యలు రాకుండా జనరేటర్లు, స్టాండ్ బై మోటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. వర్షకాలంలో కూడా ఎక్కడా ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కొత్త నీరు వచ్చినప్పుడు శుద్ధీకరణలో మార్పులు చేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు.
నగర ప్రజలకు రాబోయే రోజుల్లో 24 గంటల పాటు మంచినీటి సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే హౌసింగ్‌బోర్డు రిజర్వాయర్ పరిధిలో పైలెట్ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని, అతి త్వరలోనే 24 గంటల మంచినీటి సరఫరాను ప్రారంభిస్తామని వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో దశల వారీగా నగరవ్యాప్తంగా నిరంతర నీటి సరఫరా చేస్తామని చెప్పారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఈ కార్యక్రమం ఉందని, అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రంలోనూ ఉండాలన్న ఆలోచనతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
24 గంటల నీటి సరఫరా కోసం బూస్టర్ పంపుల వద్ద కెపాసిటీని పెంచుకోవడంతో పాటు అదనంగా 10 ఎంఎల్డీ ఫిల్టర్‌బెడ్‌ను కూడా నిర్మిస్తున్నామన్నారు. రూ.147 కోట్లతో శివారు కాలనీల్లో కూడా రోజూ మంచినీటి సరఫరా కోసం పనులు చేపడుతున్నామని తెలిపారు. మంచినీటి విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో నీటి సరఫరా చేస్తామన్నారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్, కార్పొరేటర్ ఐలేందర్, ఫిల్టర్‌బెడ్ ఇన్చార్జి అజయ్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.