కార్పొరేషన్, ఫిబ్రవరి 10: నగరంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పాలకవర్గం ముందుకు సాగుతున్నదని మేయర్ యాదగిరి సునీల్ రావు పేర్కొన్నారు. స్థానిక 34వ డివిజన్లో ధోబీఘాట్ వద్ద పలు అభివృద్ధి పనులకు శనివారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరంలో నాలుగేళ్లలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెద్ద ఎత్తున నిధులు విడుదల కావడంతో ప్రతి డివిజన్లో అభివృద్ధి పనులు చేశామని పేరొన్నారు.
శివారు డివిజన్లలో కొత్తగా వెలిసే కాలనీల్లో సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిచ్చి పనులు చేపట్టామన్నారు. రజక కులవృత్తిని ప్రోత్సహించేందుకు ఆధునిక ధోబీ ఘాట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సహకారంతో కేసీఆర్ పాలనలో నగరానికి రూ. 500 కోట్లకు పైగా ప్రత్యేక నిధులు వచ్చాయని, వీటితో అన్ని డివిజన్లలో ప్రధాన సమస్యలను పరిషరించినట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అంజుమ్, బరత్ అలీ, బల్దియా అధికారులు, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.