కార్పొరేషన్, జూన్ 14: ప్రజల అవసరాలకు అనుగుణంగానే నగరపాలక సంస్థ అభివృద్ధి పనులు చేపడుతున్నదని నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం 13వ డివిజన్లో రూ. 13 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ ముగియడంతో నగరంలో అభివృద్ధి పనుల్లో వేగం పెరిగిందన్నారు. ఇప్పటికే టెండర్లు పూర్తయిన పనులన్నింటినీ తక్షణమే ప్రారంభించేలా చర్యలు చేపట్టామన్నారు. కొత్త కొత్త కాలనీలు శరవేగంగా పెరుగుతుండగా ఆయా చోట్ల పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసి నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టి నగర రూపురేఖలు మార్చామన్నారు.
నాలుగేళ్లలో రూ.499 కోట్లతో పనులు చేశామని, వీటిల్లో రూ. 152 కోట్లు సాధారణ నిధులు, రూ.347 కోట్లు సీఎం అస్యూరెన్స్ నిధులని వెల్లడించారు. శివారు ప్రాంతాలు, డివిజన్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంటికీ ప్రతి రోజూ మంచినీటి సరఫరా అందించాలన్న లక్ష్యంతో రూ. 133 కోట్లతో పనులు చేపట్టామన్నారు. ప్రస్తుతం డ్యాంలో నీటి మట్టం తక్కువగా ఉండడంతో రోజు తప్పించి రోజు నీటి సరఫరా చేస్తున్నామని, నీటి మట్టం పెరిగిన వెంటనే తిరిగి ప్రతి రోజూ నీటి సరఫరా చేస్తామని పేర్కొన్నారు. వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు.
వర్షకాలంలో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు. వర్షాలతో ఎక్కడైనా వరద నీరు నిలిస్తే వెంటనే తొలగింపునకు చర్యలు చేపడుతామన్నారు. నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీ రిజర్వాయర్ పరిధిలో 24 గంటల పాటు మంచినీటి సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నగరంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను కూడా సత్వరమే పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ, డీఈ ఓంప్రకాశ్, డివిజన్ వాసులు పాల్గొన్నారు.