కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 18: పేద విద్యార్థులు అభ్యసించే గురుకుల పాఠశాలలకు సరఫరా చేసే వస్తువుల టెండర్లలో భారీ అవినీతి జరిగిందని, సీఎం, మంత్రులు, నేతల కన్నుసన్నల్లో అదంతా సాగిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ అవినీతిని నిరూపించేందుకు బీఆర్ఎస్ నుంచి తాము సిద్ధంగా ఉన్నామని, చర్చకు వచ్చే దమ్మున్నదా..? అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు సవాల్ విసిరారు. అవినీతి స్పష్టంగా కనిపిస్తూనే ఉందని, దమ్ముంటే ఇప్పుడే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలపై ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఏమైనా విమర్శలు చేస్తే చాలు మాటిమాటికీ రాజీనామా చేస్తానని అంటున్నారని, అంత దమ్ము మంత్రికి ఉన్నదా..? అని ప్రశ్నించారు.
మంత్రికి కనీసం తన శాఖపై పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ముందుగా శాఖపైన అవగాహన పెంచుకోవాలని హితవు పలికారు. గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద విద్యార్థులకు అందజేసే వస్తువుల విషయంలో అవినీతి చేయాలన్న ఆలోచన రావడమే అత్యంత దుర్మార్గమని, పక్కా ప్లాన్ ప్రకారం అన్నీ సిద్ధం చేసుకొని టెండర్లు పిలిచారని ధ్వజమెత్తారు. అవినీతి జరుగలేదని మంత్రులు, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, అయితే బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, ప్రవీణ్‌కుమార్ ప్రశ్నిస్తే ఎందుకు జడుసుకుంటున్నారో చెప్పాలన్నారు.
స్థానిక వ్యాపారులకు ఉపాధి కల్పించేందుకు ఈ టెండర్లను గతంలో ఎంఎస్ఎంజీ చిన్న సంస్థలకు ఇచ్చే పద్ధతి ఉండేదని, కానీ, కాంగ్రెస్ సర్కారు తమ జేబులు నింపుకునేందుకు కొత్త విధానాన్ని తెచ్చిందని ఆరోపించారు. అంతా కుమ్మక్కై మాస్ టెండర్లు పిలిచి ఇతర రాష్ర్టాల కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టే కార్యక్రమం చేశారని ఆరోపించారు. ఢిల్లీ, గుజరాత్, ఇతర రాష్ర్టాల వాళ్లకు టెండర్లు అప్పగించడంతో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. అందులో రూ.200 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు తెలుస్తున్నదని, దీనికి మంత్రి లక్ష్మణ్‌కుమార్ సమాధానం చెప్పాలన్నారు.
అందులో ఏ మాత్రం నిజం లేకపోతే, అసలు అవినీతి అన్నదే జరుగకపోతే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే అసెంబ్లీలో దీనిపై చర్చకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. వడ్ల కొనుగోళ్లలో క్వింటాల్‌కు 7 నుంచి 8 కిలోలు తగ్గిస్తున్నారని.. ధర్మపురిలో ఇసుక మాఫియా నడస్తున్నదని మాట్లాడితే.. వివరణ ఇవ్వాల్సింది పోయి రాజీనామా చేస్తానని అంటున్నారని, ఒక మంత్రిగా బాధ్యత నిర్వహించడం చేతకావడం లేదని ఎద్దేవా చేశారు. సమావేశంలో రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్‌సింగ్, బీఆర్ఎస్ నాయకుడు రఘువీర్‌సింగ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.