సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాభవన్‌లో ఉండకుండా జూబ్లీహిల్స్‌లోని సొంత ఇంట్లనే ఉంటున్నడు. కొన్నిరోజులుగా సీఎం ఆఫీస్ నుంచి వచ్చే ప్రెస్నోట్లలో ’బోధి పెవిలియన్’ అని కొత్త పేరు కనిపిస్తున్నది. మీడియా మిత్రులు ’ ఈ బోధి పెవిలియన్ ఎక్కడిది? ఎప్పుడు కట్టిండ్రు అని ఆరా తీస్తే బయటపడ్డ నిజాలు విని తలలు పట్టుకుంటున్నారు. అదే హెచ్ఆర్డీ ప్రాంగణంలో వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక విలాసవంతమైన కొత్త నివాసం కట్టుకున్నాడట. దానికి ’బోధి పెవిలియన్’ అని పేరు పెట్టిండని తేలింది. కానీ ఇక్కడ విచిత్రం ఏందంటే.. ప్రజాధనంతో కట్టిన ఆ బిల్డింగ్ ఫొటోలు ఎక్కడా బయటకు రావు! దానికి అధికారికంగా ఓపెనింగ్ ఉండదు! విపక్షాలు నెత్తీనోరు మొత్తుకుంటున్నా సీఎం అస్సలు నోరు విప్పడు! కానీ సమీక్షలన్నీ అక్కడే జరుగుతాయి. ఓ వైపు మాట్లాడితే దివాలా తీసినం అని చెప్పే సీఎం ఇంత ప్రజాధనంతో భవంతులు ఎందుకు నిర్మించినట్టు? సరే.. మరి ఆ భవనం ఎవరూ ఎందుకు చూడొద్దు? ఫొటోలు ఎందుకు బయటకురావు? ఖర్చెంత అయిందో ఎందుకు చెప్పరు? తప్పులేకపోతే దాపరికం ఎందుకో మరి! అనే అనుమానం కలుగుతున్నది.

తెలంగాణల ఇప్పుడు మరో కొత్త ’హవా’ (గాలి) నడుస్తున్నది. అదేందంటే.. హుస్సేన్‌సాగర్ నుంచి విజయవాడలోని ప్రకాశం బరాజ్వరకు ’సీ-ప్లేన్’ నడుపబోతున్నారట. రేవంత్ అనుకూల మీడియా కొన్నాళ్లుగా వార్తలతో హోరెత్తిస్తున్నది. ’వావ్.. హుస్సేన్‌సాగర్ గాల్లోకి లేచే ప్లేన్.. హైదరాబాద్ అందాలను, కృష్ణా పరీవాహకం సొగసులను చూపిస్తూ విజయవాడల దించుతది’ అని విపరీతంగా డప్పు కొడుతుండ్రు. రెండేండ్ల కిందట ఏపీల చంద్రబాబు అధికారంలోకి రాగానే.. విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ-ప్లేన్ అని ఒకసారి వచ్చి ట్రయల్ రన్ చేసి పోయిండు. ఆ తర్వాత మళ్లీ ఆ సీ-ప్లేన్ శ్రీశైలం వైపు పోయిన దాఖలాలే లేవు, ఆ ముచ్చటటే పోయింది! ఇప్పుడు తెలంగాణల రేవంత్ సర్కార్ చెప్తున్న కథ కూడా అచ్చం అట్లనే అయితదని జనాలు నవ్వుకుంటుండ్రు.
తెలంగాణలోనే సోమశిల, లక్నవరం, మిడ్ మానేరు, మల్లన్నసాగర్ లాంటి ఎన్నో అద్భుతమైన జలాశయాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. మన రాష్ట్ర పర్యాటకాన్ని అభివృద్ధి చేసి, మన జలాశయాల దగ్గర పెడితే మన తెలంగాణకు ఆదాయం వస్తది. పక్క రాష్ట్రం పర్యాటకం గురించి, విజయవాడ ప్రయాణాలు గురించి ఆలోచించడం ఎందుకో? ఏవో ముచ్చట్లు ముందటేసి టైంపాస్ చేయాలని సర్కారీ పెద్దలు చుస్తుండ్రు. నీళ్ల మీద ప్లేన్ ఎగుర్తదో లేదో తెల్వదు కానీ, పాలకులు గాల్లో రంగురంగుల మేడలైతే కడుతుండ్రు.

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు భలే గమ్మతి ముచ్చట నడుస్తున్నది. సీఎం సోదరుడి కంపెనీకి భూముల కేటాయింపు వ్యవహారంలో కాంగ్రెస్ లీడర్లు ఆడుతున్న ’అవును-కాదు’ డ్రామా చూసి జనాలు నవ్వుకుంటుండ్రు. ’అయ్యా.. ఆ కంపెనీలో ఉద్యోగులే లేరు, ఆఖరికి ఒక ఫోన్ నంబర్ కూడా సక్కగ లేదు, అసొంటి కంపెనీకి అగ్గువ ధరకే భూములు కట్టబెట్టిన్రు’ అని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నరు. ’అబ్బే.. ఇవ్వలేదు! శుద్ధ తప్పు!’ అని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నరు. ’ఇచ్చిన్రు.. ఆధారాలున్నాయి!’ అని గులాబీ నాయకులు తేల్చిచెప్తున్నారు. ’లేనే లేదు.. అసలు ఆ కంపెనీకి మాకు సంబంధమే లేదు!’ అని ఓ మంత్రి అంటున్నడు. ’ అసలు ఆ కంపెనీలో సీఎం సోదరుడే లేడు!’ అని మరో మంత్రి అంటున్నడు. ఇదిగో చూడండి ఆధారాలు’ అని బీఆర్ఎస్ నేతలు బయటపెట్టిండ్రు. దీంతో సీఎం భజన బృందంలో సభ్యుడైన ఓ ఎంపీ బయటకొచ్చి ’ఆ.. ఉన్నాడు.. అయితేంది? భూములు ఇస్తే తప్పేంది, తీసుకుంటే తప్పేంది’ అని ఎదురుదాడికి దిగడం చూస్తుంటే కాంగ్రెస్ మార్కు సమర్థన ఎట్లుంటదో మరోసారి అర్థమైపోతున్నది.

అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని చెప్పుకునే మన తెలంగాణ కాంగ్రెస్ సర్కారుల ఇప్పుడు ’సొంత ఇంటినే నిప్పు రాజుకున్నట్టు’ తయారైంది పరిస్థితి. బయట ప్రతిపక్షాలు తిడితే ఏమో గానీ.. సొంత పార్టీకి చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నోరు విప్పి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇంతకూ ఆయన అన్నదేందంటే.. ’పైన ఉన్నోడు లక్షల కోట్లు దోచుకుంటున్నడు. కానీ పేదోడికి ఇచ్చే ఈ ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్ల బిల్లు కోసం మాత్రం ఏకంగా 500 రూల్స్ పెడ్తరా?!’ అని సూటిగా, ముఖ్య నాయకుడినే టార్గెట్ చేసి కొట్టాడు!
ఇప్పుడు ఈ మాటలు విన్న జనాలు, పొలిటికల్ పండితులు ఏమంటున్నారంటే.. ’ఈ మాటలు నిజంగా పేదల మీద ప్రేమతో అన్నడా? లేకపోతే ఎప్పటినుంచో ఆశపడ్డ మంత్రిపదవి దక్కలేదనే అసంతృప్తితో సీఎం మీద విసిరిన ’ఇందిరమ్మ’ బాంబా?’ అని ఆరా తీస్తున్నారు. దీనికి కాలమే సమాధానం చెప్పాలి! ’పదవి రాకపోతే గానీ లోపలి మనిషి బయటకు రాడు’ అన్నట్టుంది ఈ వ్యవహారం! ఎన్నికల ముందు ’ఇంద్రమ్మ రాజ్యం తెస్తాం.. పేదోడికి ఇండ్లు కట్టిస్తాం’ అని ఓట్లు దండుకున్నారు. తీరా గద్దెనెక్కిన తర్వాత పేదోడి ఇంటి బిల్లుకు వంద రూల్స్ పెట్టి.. పైన ఉన్నోళ్లు మాత్రం ’లక్షల కోట్ల’కు ఎసరు పెడుతున్నారని సొంత పార్టీ లీడరే బజారులో ఇజ్జత్ తీయడం కాంగ్రెస్ మార్కు క్రమశిక్షణకు నిదర్శనం! ఇగ మున్ముందు ఈ ’లక్షల కోట్ల దోపిడీ’ మీద రేవంత్ ఏమని కౌంటర్ ఇస్తడో చూడాలి. హైలెట్ ఏందంటే.. పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవు అని కాంగ్రెస్ పెద్ద మనిషి అంటుంటే మీ పార్టీకి లైన్ కూడా ఉన్నదా అని జనం నవ్వుకుంటున్నరు.
-దాము నర్మాల