Hanging | రామగిరి, నవంబర్ 14: పోతారం గ్రామానికి చెందిన వోడ్నాల రాజేశం కుటుంబంలో విషాదం నెలకొంది. రాజేశం కూతురు మను శ్రీ అలియాస్ సుప్రియా (23) అదనపు వరకట్న వేధింపులు భరించలేక ఉరివేసుకొని మరణించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సుప్రియకు 2023లో కల్వచర్ల గ్రామానికి చెందిన వేముల సతీష్ తో వివాహం జరిగింది. వివాహ సమయంలో 13 తులాల బంగారం, రెండు లక్షల విలువైన గృహోపకరణాలు వరకట్నంగా ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
దంపతులకు 23 నెలల కుమారుడు ఉన్నాడు. వివాహం తర్వాత కొద్ది కాలంలోనే భర్త సతీష్, అతని తల్లిదండ్రులు భూలక్ష్మి, చంద్రయ్య, అలాగే అతని అన్న స్వామి కలిసి సుప్రియను మరో రూ.రెండు లక్షలు తీసుకురావాలని తరచూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని తండ్రి రాజేశంకు సుప్రియ తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోతారం గ్రామంలో పంచాయతీ నిర్వహించగా, సతీష్ సుప్రియను మంచిగా చూసుకుంటానని హాజరుల ముందు హామీ ఇచ్చి తిరిగి ఇంటికి తీసుకెళ్లాడు. కాని కొద్ది రోజులకే వేధింపులు మళ్లీ మొదలయ్యాయని కుటుంబ సభ్యులు వాపోయారు.
ఈరోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో సుప్రియా ఉరివేసుకొని చనిపోయిందని సతీష్ అన్న వేముల స్వామి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో, వోడ్నాల రాజేశం కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. బెడ్రూమ్ లో సుప్రియా మృతదేహం కనిపించగా, ఆమె చేతి గాజులు పగిలి ఉండటం, ఎడమ చేతికి గాయాలు, అలాగే మెడకు ఉరివేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై సుప్రియ తండ్రి వోడ్నాల రాజేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామగిరి ఎస్సై టి శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. అనంతరం గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ దర్యాప్తు ప్రారంభించారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.