గొల్లపల్లి, నవంబర్ 30 : మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిలా పనిచేయాలని, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. గత పాలకుల హయాంలో దండుగలా మారిన వ్యవసాయం స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో పండుగలా మారిందని పేర్కొన్నారు. గొల్లపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం గొల్లపల్లిలోని ముస్కు శ్యాం సుందర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించగా, మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా ఎంపికైన ఏఎంసీ చైర్మన్ కాంపెల్లి హన్మాండ్లు, వైస్ చైర్మన్ కనుకుంట్ల లింగారెడ్డి, పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి అనంతరం మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24గంటల ఉచిత కరెంట్ ఇవ్వడమే కాకుండా రైతుబీమా, రైతుబంధు అమలు చేస్తున్నదన్నారు. పంటలకు మద్దతు ధర ఇస్తూ రైతుకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల ధాన్యం కొనడానికి ముందుకు రాకున్నా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు. మార్కెట్ యార్డులో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, మార్కెట్ యార్డుల్లో రైతుల ఇబ్బందులను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి పాలకవర్గాన్ని నియమించామన్నారు. మార్కెట్ యార్డులో సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.