మంథని, నవంబర్ 5: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కారు పార్టీ జెట్స్పీడ్తో దూసుకెళ్తున్నది. వాడవాడలా ప్రచారంలో హోరెత్తిస్తున్నది. ఇంటింటికీ పథకాలను వివరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నది. జోరుగా చేరికలతో కళకళలాడుతున్నది. వెరసీ మంథని గడ్డపై గులాబీ జెండాను ఎగురవేసేందుకు క్యాడర్ కదనోత్సాహంతో ముందుకుసాగుతున్నది. మరోవైపు కాంగ్రెస్ ముఖ్య నేతలు రోజుకొకరూ పార్టీని వీడుతుండడంతో కుదేలవుతున్నది. టికెట్ల కుమ్మలాటల నుంచి తేరుకుని ఎన్నికల గోదాలో దిగిన ఆ పార్టీకి ప్రజల మద్దతులేక వెలవెలబోతున్నది. ప్రచారంలోనూ వెనుకబడిపోయిన ఆ పార్టీ అభ్యర్థికి ప్రజల ఆదరణ కరువవుతున్నది.
మంథని నియోజకవర్గంలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్, మల్హర్, కాటారం, మహదేవపూర్, పంకెన, మహాముత్తారం మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారు. మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ నియోజకవర్గంలో విస్త్రతంగా పర్యటిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్తో పాటు తన సొంత మ్యానిఫెస్టోనూ వివరిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని కోరుతున్నారు.
ఇదే సమయంలో ఇతర పార్టీల నాయకులు, యువతను పెద్దసంఖ్యలో పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన రామగిరి మండలం నాగెపల్లి గ్రామానికి చెందిన ఉమ్మడి కరీంనగర్ డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి, కమాన్‌పూర్ మాజీ జెడ్పీటీసీ ఎల్లే శశిరేఖ భర్త ఎల్లె రామ్మూర్తి, కాంగ్రెస్ మాజీ మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ సెగ్గెం రాజేశ్‌తో పాటు శ్రీధర్‌బాబు సొంత గ్రామమైన ధన్వాడ మాజీ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నేత తోంబర్ల వెంకటరమణ, పెద్దపల్లి పార్లమెంట్ యూత్ విభాగం మాజీ ప్రధాన కార్యదర్శి జంజర్ల శేఖర్, మాజీ సర్పంచ్ జంజర్ల పల్లవి తదితరులు నాయకులు హస్తాన్ని వీడి కారెక్కారు.
తాజాగా మంథనిలోని రాజగృహలో ఆదివారం మల్హర్ మండలం పెద్దతూండ్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తాళ్ల రాజేందర్, యూత్ కాంగ్రెస్ నేత తాళ్ల రవీందర్‌తో పాటు మరో 100 మంది కార్యకర్తలు, ముత్తారం మండల మాజీ వైస్ ఎంపీపీ, బీజేపీ నేత శ్రీమల్ల తిరుమల్, కాటారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన చీర్ల బాపురెడ్డితో పాటు మంథని మండలం గుంజపడుగు కుచెందిన పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి పుట్ట మధూకర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏది ఏమైనప్పటికీ మంథని నియోజకవర్గంలో రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుండగా..బీఆర్ఎస్ పార్టీ బలపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.