సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 4 : ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు లేకుండా మాలల గొంతు కోసింది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డేనని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మాందాల భాస్కర్ విమర్శించారు. రిజర్వేషన్లు లేక ప్రభుత్వ, విద్యారంగంలో నోటిఫికేషన్లలో తాము ఉద్యోగాలు కోల్పోతుంటే కాంగ్రెస్ పార్టీలో మాల రిజర్వేషన్‌తో పదవులు అనుభవిస్తున్న నాయకులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను విస్మరించి మాల సామాజికవర్గానికి ఆరు నెలలుగా రిజర్వేషన్లు లేకుండా చేసి గొంతు కోసింది రేవంత్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. ఆయన స్వలాభం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాల సామాజిక వర్గానికి చెందిన 26 కులాలకు రిజర్వేషన్ లేకుండా చేశాడని మండిపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్లలో శాతవాహన యూనివర్సిటీ అసిస్టెంట్, కాంట్రాక్టు ప్రొఫెసర్, ఆర్టీసి ఉద్యోగాలకు సంబంధించి వెయ్యి పోస్టులుంటే మాల సామాజిక వర్గానికి కేవలం 28 పోస్టులు మాత్రమే వచ్చాయని చెప్పారు. గ్రూప్-1, గ్రూప్-2లో తమకు రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు రాకపోవడానికి కారణం కూడా ఆయనేనని మండిపడ్డారు.
ఇంత అన్యాయం జరుగుతుంటే మాల సామాజికవర్గం నుంచి రిజర్వేషన్ పొందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గడ్డం వివేక్‌వెంకటస్వామి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మాల, మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో మాల సామాజికవర్గం నాయకులు పునరాలోచన చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ రంగంలో మాల సామాజికవర్గానికి అవకాశాలు లేకుండా చేస్తున్న అంశంపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. మా పోరాటంలో భాగస్వాములు కాకపోతే ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. మాల సామాజికవర్గ నాయకులు ఏ పార్టీలో ఉన్నా పోరాటంలో భాగస్వాములు కావాలని, తినే అన్నంలో మట్టి కొట్టిన రేవంత్‌కు సరైన గుణపాఠం చెప్పేందుకు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రాంచందర్ మాట్లాడుతూ, విద్యార్థులు, ఉద్యోగులకు అన్ని రంగాల్లో తీరని అన్యాయం జరుగుతున్నదని ఆవేదన చెందారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా చేసిన ఎస్సీ వర్గీకరణను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మాలలకు తీరని అన్యాయం చేసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని రాబోయే అన్ని ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిరిసిల్ల జిల్లా మాలల ఐక్య వేదిక కన్వీనర్ తుంగ శివరాజ్, కో కన్వీనర్ జక్కుల యాదగిరి, పాటి కుమార్రాజు, సిరిగిరి మురళి, బూర యాదగిరి, నర్సయ్య, చంద్రశేఖర్‌రాజు, నాగరాజు, బాబు, ఆయా మండలాల అధ్యక్షులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.