పెబ్బేరు, ఫిబ్రవరి 24 : పెబ్బేరు సంత స్థలం యజమానికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపులో పనిలోపనిగా కొందరు కాంగ్రేస్ నేతలు అక్రమ లబ్ధి పొందేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. స్వయానా సీఎం సోదరుడి ఆధ్వర్యంలోనే ఈ వ్యవహారమంతా రూపు దిద్దుకుంటోందన్నట్లు తమకు సమాచా రం అందిందని ఆయన వెల్లడించారు.
మంగళ వారం ఆయ న పెబ్బేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. ప్రతి శనివారం పెబ్బేరులో సంత జరిగే 30.19 ఎకరాల స్థలానికి యజమానులైన వారికి ప్రత్యామ్నాయంగా మరోచోట స్థలాన్ని కేటాయించే క్రమాన్ని కొందరు అవకాశంగా తీసుకొని.. ప్రభుత్వాన్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. స్థలాన్ని కోల్పోయే యజమానికి జిల్లా పరిధిలోనే దానికనుగుణమైన స్థలాన్ని కేటాయించాలన్న నిబంధన ఉందన్నారు. కానీ, కాంగ్రెస్ నేతలు మాత్రం హైదరాబాద్‌కు దగ్గరలో షాద్‌నగర్, శంషాబాద్ ప్రాంతంలోని ఎంతో విలువైన భూమిని అప్పజెప్పుతూ.. తా ము కూడా అందులో అక్రమంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
పెబ్బేరులో స్థలం కోల్పోయే యజమానులకు న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నానని, కానీ దీన్ని అడ్డం పెట్టుకొని కొందరు లబ్ధి పొందేందుకు ప్రయత్నిండమే ఆక్షేపణీయని ఆయన అన్నారు. జిల్లాను దాటి భూమిని కేటాయించేందుకు జరుగుతున్న ప్రయత్నాల వెనుక మతలబు ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై తాను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాసి ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన వెల్లడించారు.
2003 నుంచి 2022 వరకు పలు కోర్టులు పెబ్బేరు సంత స్థలం యజమానులదేనని తీర్పులు ఇచ్చాయని నిరంజన్‌రెడ్డి అన్నారు. వాటికనుగుణంగా అప్పటి అధికార యంత్రాంగం యజమానులకు భూ హక్కులు కేటాయిస్తూ ఓఆర్సీని మం జూరు చేసిందని..ఇందులో తమ బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రమే యం ఏమీ లేదని స్పష్టమవుతోందన్నారు. కానీ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు రాజకీయంగా పబ్బం గడుపుకొనేందుకు తమపై అసత్య ఆరోపణలు చేసి లబ్ధిపొందారన్నారు.
పెబ్బేరు సంతకు సంబంధించిన మొత్తం 30.19 ఎకరాల స్థలం ప్రభుత్వానిదేనని వారు ప్రజలను తప్పుదోవ పట్టించారని చెప్పారు. ఆ స్థలంలో కుర్చి వేసుకొని కూర్చొని ప్రహరీ కట్టిస్తానని చెప్పిన నాయకుడు అధికారంలోకి వచ్చి ఎందుకు ఆ పని పూర్తి చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర ఏండ్లు దాటినప్పటికీ ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేదన్నారు. సం త స్థలం విషయంలో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కూడా బీరాలు పలికి ప్రజలను నమ్మించారని, కానీ కార్యచరణ మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాట తప్పినందుకు వారు ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తాను మంత్రిగా కొనసాగిన సమయంలో పెబ్బేరు ప్రజలు తన దగ్గరికొచ్చి సంత స్థలాన్ని కాపాడాలని కోరారన్నారు. సంత జరుగుతున్న స్థలం సంతకే దక్కేందుకు తగు చర్యలు తీసుకోవాలని తనను అభ్యర్థిస్తే యజమానులు పెబ్బేరు వా సుల ఏకభిప్రాయం మేరకు ఆ స్థలం సంతకే దక్కేందుకు తన వంతుగా కృషి చేశానన్నారు. ఈ విషయమంలో తాను ముం దుచూపుతో మంచి చేయబోతే తనపై లేనిపోనివి ఆపాదించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాను సంత స్థలాన్ని కబ్జా చేసినట్లు విరివిగా ప్రచారం చేసి తనను అబాసుపాలు చేశారని ఆయన అన్నారు. అధికారంలో ఉన్న నాయకులు పట్టించుకోకపోవడం వల్ల సంత స్థలం చేజారి పోయి మళ్లీ యజమానులకే దక్కిందన్నారు. ప్రస్తుతం పెబ్బేరులో సంత నిర్వహించుకొనేందుకు స్థలమే లేకుండా పోయిందని ఆయన వివరించారు. ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలు గ్రహించాలని నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రెస్వామి, నాయకులు దిలీప్‌రెడ్డి, రాములు, కౌన్సిలర్లు సౌజన్య, మన్యం తదితరులు పాల్గొన్నారు.