మానకొండూర్ రూరల్, ఏప్రిల్ 26 : కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం మద్దికుంట గ్రామానికి చెందిన గీత కార్మికుడు బండి మునీందర్ గౌడ్ (51) తాటి చెట్టుపై నుండి ప్రమాదవశాత్తు కింద పడి, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రోజు వారీగా మునీందర్ గౌడ్ శనివారం సాయంత్రం తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు మోకు జారీ క్రింద పడ్డాడు.
తీవ్ర గాయాలు కాగా, తోటి గీత కార్మికులు, గ్రామస్తులు 108 వాహనంలో కరీంనగర్లోని ఓ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించి, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం సభ్యులు కోరుతున్నారు.