Korutla | కోరుట్ల, మే 4: కోరుట్ల డివిజన్ స్థాయిలో నూతనంగా ఏర్పాటుచేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను డివిజన్ స్థాయి అధికారులు, తహసీల్దార్లతో కలిసి ఆర్డీవో స్వీకరించారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడుతూ పలు సమస్యల పరిష్కారం కోరుతూ డివిజన్ కేంద్రంతో పాటు డివిజన్ లోని పలు మండలాల నుంచి ప్రజలు సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వచ్చారని తెలిపారు.
అధికారులు శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించాలని, సమస్యల పై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చొరవ చూపాలని ఆర్డీవో అధికారులకు సూచించారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 9 ఫిర్యాదులు అందినట్లు ఆర్డీవో వివరించారు. ఇందులో రెవెన్యూ విభాగానికి సంబంధించి 7 దరఖాస్తులు, మున్సిపల్-01, పంచాయతీ రాజ్-01 వినతులు వచ్చాయని తెలిపారు. ప్రతీ సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో జైపాల్ రెడ్డి, పంచాయతీరాజ్ సబ్ డివిజన్ డీఈ ఈ సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, మున్సిపల్ రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.