ఆనాడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగకపోయి ఉంటే నేటికీ తెలంగాణ రాష్ట్రం ఒక కలగానే మిగిలిపోయేది. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అడియాశే అయ్యేది. కానీ, ఒక్కడిగా ఉద్యమాన్ని ఆరంభించి, నాలుగు కోట్ల ప్రజలను ఏకతాటిపై నడిపించి, చివరకు గమ్యాన్ని ముద్దాడిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. ఎవరూ అవునన్నా కాదన్న.. తెలంగాణ సాధనలో కేసీఆర్‌ది ఒక చరిత్ర. ఉద్యమాన్ని నడుపడంలో ఆయన అనుసరించిన మార్గాలు.. చూపించిన రాజకీయ చతురత, ప్రజలను ఏకం చేసిన విధానం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొని ముందుకు నడిచిన తీరు.. తెలంగాణ ప్రతి పౌరుడి గుండెలో చిరస్థాయిగా నిలిచిపోగా.. ఆనాడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి గమ్యాన్ని ముద్దాడిన చరిత్రను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే.. నాయకత్వ లక్షణాలు పునికి పుచ్చుకొని వివిధ రంగాల్లో రాణించాలనుకునే ప్రతి యువతీ యువకుడు తన లక్ష్యాన్ని చేరుకోవాలంటే స్వరాష్ట్ర ఉద్యమ చరిత్రను ఔపోసన పట్టాల్సిన అవసరమున్నది.
ఉద్యమ చరిత్రపై చెరిగిపోని సంతకం చేసిన మహా నాయకుడు కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగిన రోజే దీక్షా దివస్. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో ‘2009 నవంబర్ 29’న ప్రారంభించిన ఈ దీక్ష చరిత్రలో అజరామరంగా నిలిచిపోయింది. రాష్ట్ర సాధనకు అంకురార్పణ చేసిన ఈ దీక్షకు నేటితో సరిగ్గా పదిహేనేండ్లు కాగా, మళ్లీ ఆ నాటి ఉద్యమస్ఫూర్తిని రగిలించేలా నేడు దీక్షా దివస్‌ను నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది.
2009 నవంబర్ 29కు చరిత్ర చాలా ఉన్నది. ఆ రోజు కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పింది. తెలంగాణ సాధన కోసం సబ్బండ వర్గాలను ఏకం చేసింది. నాలుగుకోట్ల ప్రజలను పిడికిలి ఎత్తేలాచేసింది. ‘మా తెలంగాణ మాకు కావాలే’ అనే ఆకాంక్షను నలుదిక్కులా చాటిచెప్పింది. ఆనాటి సమైక్య పాలకుల కుట్రలను, కుతంత్రాలను తిప్పికొట్టింది. చివరకు గమ్యాన్ని ముద్దాడింది. ఈ ఘనత ప్రాణాలను పణంగా పెట్టి దీక్షకు దిగిన కేసీఆర్‌కు మాత్రమే దక్కుతుంది. ఈ చరిత్రను ఎవరూ తుడిచి వేద్దామని కుట్రలు చేసినా.. అది తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదు. స్వరాష్ట్ర సాధనలో కేసీఆర్ ఆనవాళ్లను ఎవరైనా చెరిపివేసేందుకు ప్రయత్నించినా అది సాధ్యం కాదు. కొంత మంది కుహనా రాజకీయ నాయకులకు తాత్కాలికంగా తృప్తినిచ్చినా.. అంతిమంగా తెలంగాణ ప్రజల గుండెల్లోంచి కేసీఆర్‌ను తొలగించడం ఎవరి తరమూ కాదు.
కరీంనగర్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆనాడు సీమాంధ్రలో బలవంతంగా విలీనం చేసిన తర్వాత తెలంగాణ అన్ని రకాలుగా దగా పడ్డది. పాలకులు సీమాంధ్రులే కావడంతో వనరుల దోపిడీకి అడ్డూ అదుపులేకుండా పోయింది. 1969 ఉద్యమం తర్వాత మళ్లీ ఆనాటి సమైక్యవాదులను ఎదురించే నాథుడే లేకుండా పోగా, అన్నింటా అన్యాయం జరిగింది. దశాబ్దాల దోపిడీకి అడ్డుకట్ట వేసి, నాలుగున్నర కోట్ల ప్రజల ‘ప్రత్యేక రాష్ట్ర’ ఆకాంక్ష నెరవేర్చే లక్ష్యంతో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని (ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి) ఏర్పాటు చేశారు. తెలంగాణ దాస్య శృంఖాలు తెంచడానికి కదిలారు. అలా ఆనాడు ఒక్కడితో మొదలైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నాలుగుకోట్ల ప్రజల గుండెచప్పుడులా మారింది. గులాబీ పార్టీ ఉద్యమ కెరటమైంది. ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు ఎదురొడ్డి నిలిచింది. 14 ఏళ్ల పాటు అలుపెరుగని పోరాటం సాగింది.
ఒక ప్రాంత సమస్య కోసం ఎన్నోసార్లు తమ పదవులను తృణపాయంగా వదులుకొని దేశచరిత్రలో రికార్డు సృష్టించడమే కాదు, ఇక్కడి ఆకాంక్షను ప్రపంచానికి చాటిన ఘనత గులాబీ పార్టీ సొంతం చేసుకున్నది. దశాబ్దాల కాలంగా సాగిన జల, వనరుల దోపిడీ, రాజ్యంగ ఉల్లంఘనలపై పోరాటాలు చేసింది. ఉద్యమంలో పాల్గొంటూనే ఇక్కడ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడింది. 2006 ఆగస్టు 23న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద అమరణ నిరాహార దీక్షచేసి, తెలంగాణ ఆకాంక్షను దేశవ్యాప్తంగా చాటి చెప్పింది. పులిచింతల, పోలవరం, దుమ్మెగూడం, టేల్ పాండ్ వంటి అనేక ప్రాజెక్టుల కింద జలదోపిడీపై ఆనాడు ఉద్యమించింది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌పై బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిరసిస్తూ రాజీవ్ రహదారిని 24 గంటలపాటు దిగ్బంధించింది. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ రక్కసి, మహబూబ్‌నగర్‌లో వలసలు, ఉత్తర తెలంగాణ గల్ఫ్ బాధితులు, బీడీ కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు నడిపింది. ఫ్రీజోన్ విషయంలో ఒత్తిళ్లు తెచ్చి విజయం సాధించింది. సింగరేణి కార్మికుల లాభాల వాటాల పెంపునకు కూడా కృషి చేసింది. పెద్దమనుషుల ఒప్పందం, ముల్కీ నిబంధనలు, ఆరు సూత్రాల పథకం, 610 జీవో లాంటి ఉల్లంఘనలపై ప్రభుత్వ తీరును ఎండగట్టింది. ఇవి మచ్చుకు మాత్రమే.. ఒక్క మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ది సమస్తం పోరాటాల చరిత్రే.
మలుపుతిప్పిన ఆమరణ దీక్ష
నాలుగు కోట్ల ప్రజల ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష సాధనకు ఆరు దశాబ్దాల్లో జరిగిన పోరాటాలు గమ్యాన్ని ముద్దాడలేకపోయాయి. ఆనాటి సమైక్య వాదులు, కేంద్ర, రాష్ట్ర పాలకుల కుట్రలు కుతంత్రాల ముందు ఉద్యమాలు సన్నగిల్లాయే తప్ప లక్ష్యాన్ని అందుకోలేకపోయాయి. కానీ, కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మాత్రమే యావత్ తెలంగాణను కదిలించింది. 2009 నవంబర్ 29న కరీంనగర్‌లోని కేసీఆర్ భవన్ నుంచి సిద్దిపేట పరిధిలోని రంగధాంపల్లిలో దీక్షాస్థలికి కేసీఆర్ బయలుదేరగా, పోలీసులు పక్కాప్లాన్‌తో అల్గునూర్ చౌరస్తా వద్ద అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఖమ్మం జైలుకు తరలించారు. ఆ తర్వాత నిమ్స్ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడే కేసీఆర్ దీక్షను 11 రోజుల పాటు కొనసాగించారు. రోజురోజుకూ కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో దీక్షను విరమింపజేసేందుకు ఆనాటి పాలకులు అనేక ప్రయత్నాలు చేశారు. అయినా కేసీఆర్ మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా తన దీక్షను కొనసాగించారు. ‘నా దీక్ష వల్ల తెలంగాణ వస్తే జైత్రయాత్ర.. లేదంటే నా శవయాత్ర ఉంటుంది’ అని ప్రకటించారు. కేసీఆర్ దీక్షతో తెలంగాణ అగ్గిగుండంలా మారింది. ఉద్యమం మరింత ఉగ్రరూపం దాల్చింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో కేంద్రం దిగొచ్చి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాతే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది.
ఉద్యమ స్ఫూర్తితో దీక్షా దివస్
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమం దేశ చరిత్రలో నిలిచిపోయింది. పడిన తెలంగాణ దాస్య శృంఖలాలు తెంచడానికి కేసీఆర్ సాగించిన పోరాటం ఒక చెరగని ముద్రవేసుకున్నది. నాడు చేసిన ఉద్యమాలు ఒక చారిత్రక ఘట్టాలుగా నిలిచాయి. వీటన్నింటి గురించి నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అయితే తెలంగాణ ఉద్యమ చరిత్రను చెరిపేసేందుకు అనేక కుట్రలు నడుస్తున్నాయి. దేశ స్వాతంత్య్ర కోసం ఆనాడు సాగిన పోరాటాలను మనం పాఠ్యాంశాల రూపంలో తెలుసుకున్నా.. మన రాష్ట్ర చరిత్రను మాత్రం పాఠ్యాంశాల రూపంలో తేకుండా మరుగున పడేసేందుకు కుతంత్రాలు జరుగుతున్నాయి.
ఇదే సమయంలో రాష్ట్రంలో పదేళ్ల కిందటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. అవే నిర్బంధాలు, అణచివేతలు కొనసాగుతున్నాయి. పది నెలల పాలనలో ప్రజలను అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని రగిలించేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమైంది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్యం చేసి, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నది. దీక్షా దివస్‌తో మరో సంకల్ప దీక్షకు సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. ఇటు ప్రస్తుత తరుణంలో దీక్షా దివస్ లాంటి కార్యక్రమాలు చాలా అవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయ పార్టీల కోణంలో చూడద్దని, అసలు దీక్షా దివస్ సారాంశం ఏమిటో ఒకసారి లోతుగా పరిశీలించాలని యువతకు సూచిస్తున్నారు.
నేడు అల్గునూర్‌కు కేటీఆర్
నాటి ఉద్యమ పరిస్థితులను నేటి యువతకు చెప్పడమేకాదు, పార్టీ శ్రేణులను కార్మోన్ముఖులను చేసేందుకు బీఆర్ఎస్ రాష్ట్రంలోని 33 జిల్లాలో నేడు దిక్షా దివస్‌ను నిర్వహిస్తున్నది. దీక్షా దివస్‌కు కరీంనగర్ జిల్లాకు ప్రత్యేక అనుబంధం ఉండగా, ఆనాడు కేసీఆర్‌ను అరెస్ట్ చేసిన అల్గునూర్లోనే దీక్షా దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. మాజీ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఉదయం 10:30 గంటలకు ఎల్ఎండీలోని నీటిపారుదల శాఖ కార్యాలయం వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి.. ర్యాలీగా అల్గునూర్ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడ కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తారు. అనంతరం 11:30 గంటలకు వరంగల్ రోడ్డులో నిర్వహించే దీక్షా దివస్ సభలో పాల్గొననున్నారు. అయితే ఈ సభను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేయగా, కరీంనగర్ జిల్లాలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతోపాటు వివిధహోదాల్లో ఉన్న నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో కరీంనగర్‌ది ప్రత్యేక స్థానం. స్వరాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమాల్లో ఈ గడ్డ అనేక చారిత్రక ఘట్టాలకు వేదికైంది. అందులో మచ్చుకుకొన్ని..
2001 ఏప్రిల్ 27 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ తెలుగుదేశం పార్టీకి, తన శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావానికి నాంది పలికారు.
2001 మే17: కరీంనగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర కళాశాల వేదికగా ‘సింహగర్జన సభ’ నిర్వహించారు. లక్షలాది మంది సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (ప్రస్తుత భారత రాష్ర్ట సమితి ) ఏర్పాటును కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. తెలంగాణ వచ్చేదాకా మడమ తిప్పబోనని ప్రతినబూనారు. అప్పటి వరకు ప్రపంచ చరిత్రలోనే కనీవినీ ఎరుగనిరీతిలో ఈ సభ విజయవంతం కాగా, ఈ ఘనత కరీంనగర్ గడ్డకే దక్కింది. దేశవ్యాప్తంగా స్వరాష్ట్ర సాధన కోసం ఎన్నో ఉద్యమాలు జరిగినా, సింహగర్జన మాత్రం వాటన్నింటికి మించి ఓ చరిత్రను సృష్టించింది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నలుదిశలా చాటింది.
2004 జూన్ 7: 2004లో యూపీఏ ప్రభుత్వానికి మద్దతు పలికిన కేసీఆర్, తనదైన స్థాయిలో చక్రం తిప్పి, ఆ యేడాది జూన్ 7న రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించేలా చేయగలిగారు. అప్పుడు కరీంనగర్ ఎంపీగా ఉన్నారు. ఈ ఘనత కూడా ఈ గడ్డకే దక్కింది. 2005 జనవరిలో కేంద్ర మంత్రి ప్రణబ్‌ముఖర్జీ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు కూడా టీఆర్ఎస్ విజయమే! అప్పుడు కూడా కరీంనగర్ ఎంపీగానే ఉన్నారు
2006 సెప్టెంబర్ 12: తెలంగాణ వాదం లేనేలేదంటూ కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలతో కలత చెందిన కేసీఆర్, తన పదవులను తృణ ప్రాయంగా వదిలిపెట్టారు. కరీంనగర్ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్వరాష్ట్ర సాధనలో పదవుల త్యాగానికి శ్రీకారం చుట్టిన ఘనత కూడా ఈ ప్రాంతానికే దక్కింది.
2006 డిసెంబర్ 7: కరీంనగర్ లోక్‌సభ ఉప ఎన్నిక జరిగింది. అప్పడు ఈ గడ్డ ప్రజలు 2,01,582 ఓట్ల బంపర్ మెజార్టీనిచ్చి కేసీఆర్‌ను గెలిపించారు. తెలంగాణవాదం ఉందని బలంగా చాటిచెప్పారు. ఈ ఎన్నిక ద్వారా బీఆర్ఎస్కు పునర్జన్మనిచ్చిన ఖ్యాతి కూడా కరీంనగర్‌కే దక్కుతుంది. నిజానికి ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే కేసీఆర్‌ను ఓడించి, తెలంగాణ వాదం లేదని చెప్పడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చేయని ప్రయత్నం లేదు. యావత్ మంత్రులను నియోజకర్గంలో దించి, కోట్ల రూపాయలు పంచారు. కానీ, కరీంనగర్ గడ్డ ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లొంగలేదు. భారీ మెజార్టీనిచ్చి కుట్రదారుల చెంపచెల్లుమనిపించేలా తీర్పునిచ్చారు.
2009 నవంబర్ 29: ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు కరీంనగర్‌లోని కేసీఆర్ భవన్ నుంచి బయలు దేరిన కేసీఆర్‌ను అల్గూనూర్ చౌరస్తా వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో ఆనాడు కరీంనగర్ భగ్గుమన్నది. కేసీఆర్‌కు అండగా నిలిచింది. ఉద్యమ ఉగ్రరూపం రూపు దాల్చి, 24గంటల్లోనే రాష్ట్రమంతటా విస్తరించింది. పదకొండు రోజులపాటు సాగిన ఆమరణ దీక్షతో కేంద్రం దిగొచ్చి, తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఈ విజయం వెనుక కరీంనగర్ గడ్డ ఉన్నది.
2011 సెప్టెంబర్ 23 : ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చరిత్రలో నిలిచిపోయే సకలజనుల సమ్మెకు కరీంనగర్ గడ్డ మీద నుంచే కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎస్సారార్ కళాశాల మైదానంలో జరిగిన సభా వేదికగా సకల జనుల చారిత్రక సమ్మెకు రణభేరి మోగించారు. ఈ సమ్మె యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది.
2012 నవంబర్ 7, 8: రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశాలను అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కరీంనగర్‌లోని ప్రతిమ హోటల్ వేదికగా ఏర్పాటు చేసిన ఈ కార్యవర్గ సమావేశాల్లో అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాదు, తెలంగాణ సాధించే వరకు తమ పోరాటం విరమించేది లేదని ఈ గడ్డ వేదికగా ప్రతిన బూనారు.
2013 సెప్టెంబర్ 7: తెలంగాణ సాధనకు పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ శిబిరాలను నిర్వహించాలని నిర్ణయించి, తొలి శిక్షణ శిబిరాలను హుజూరాబాద్ కేంద్రంగా ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ ప్రారంభించారు. ఈ శిక్షణలో భాగంగా ఆనాడు బ్రోచర్లు, పుస్తకాల ద్వారా అందించిన సమాచారం, ఉద్యమనేత ఆనాడు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించిన తీరు ప్రతి బిడ్డనూ ఉద్యమంవైపు నడిపించింది.
2014 ఏప్రిల్ 13: స్వరాష్ట్రంలో మొదటిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ఎస్సారార్ కళాశాలలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో కేసీఆర్ శంఖారావం పూరించారు. అద్భుత విజయాన్ని సాధించి తొలిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టడానికి ఈ గడ్డే వేదికైంది.
దీక్షా దివస్‌కు తరలిరండి
కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 28 : తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన నవంబర్ 29న దీక్షా దివస్‌గా పెద్ద ఎత్తున చేపడుతున్నామని, అల్గునూరులో నిర్వహించే ఈ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. గురువారం అల్గునూర్ ప్రాంతంలో దీక్షా దివస్‌కు సంబంధించిన ఏర్పాట్లను రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆనాడు కేసీఆర్ చేపట్టిన దీక్ష వల్లే రాష్ట్రం సాధ్యమైందన్నారు. కేసీఆర్ ఎక్కడ అరెస్టు అయ్యారో ఆ స్థలాన్ని తాము పవిత్రంగా భావిస్తున్నామని తెలిపారు.
అక్కడే దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దీనికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ వస్తున్నారని తెలిపారు. మేధావులు, కళాకారులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ, కేసీఆర్ ఆమరణ దీక్ష వల్లే తెలంగాణ సాధ్యమైందన్నారు. ఆనాడు కరీంనగర్ నుంచి ఖమ్మం వరకు తెలంగాణ ప్రజలు తరలివచ్చారని, దీనిని గుర్తు చేసుకుంటూ చేపడుతున్న దీక్షా దివస్‌కు అందరూ తరలిరావాలని కోరారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్, నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.