కరీంనగర్ తెలంగాణ చౌక్/ మంథని, డిసెంబర్ 4: పెద్దపల్లిలో సీఎం రేవంత్ సభ ప్రయాణికులకు పాట్లు తెచ్చిపెట్టింది. ఆర్టీసీ మెజార్టీ బస్సులను సభకు పంపించడంతో పలు రూట్లలో ఒక్క బస్సూ నడువక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కరీంనగర్ రీజియన్ పరిధిలోని వివిధ రూట్లలో ప్రతి రోజూ 892 బస్సు సర్వీసులను నడిపిస్తుంటారు. అయితే పెద్దపల్లిలో సీఎం సభకు ప్రజలను తరలించేందుకు 429 బస్సుల ను ఆర్టీసీ అధికారులు కేటాయించగా, కేవలం 463 బస్సులు మాత్రమే ప్రయాణికుల కోసం ఆయా రూట్ల లో నడిపించారు. కొన్ని రూట్లలో అసలు బస్సులే నడువకపోగా, ఎక్కువగా రద్దీగా ఉండే రూట్లలో వెళ్లే ప్ర యాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రోజువారీగా నడిచే ట్రిప్పులతో చూస్తే బుధవారం దాదాపు 1200 ట్రిప్పులు తగ్గగా, ఎక్కువగా రద్దీగా ఉండే వేములవాడ, వరంగల్ నిజామాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్ రూట్లలో గంటల తరబడి బస్టేషన్లో వేచి ఉం డాల్సిన దుస్థితి ఏర్పడింది. వచ్చిన బస్సుల్లోనే కిక్కిరి సి వెళ్లడం కనిపించింది. రద్దీ దృష్ట్యా డిపో-2 మల్ల య్య, ఏటీఎం సురేశ్, స్టేషన్ మేనేజర్ అంజయ్య కలిసి హైదరాబాద్, కామారెడ్డి, బాన్సువాడ నుంచి 60 బస్సులను రప్పించినప్పటికీ పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోయాయి. ఫలితంగా ముఖ్యంగా వివిధ గ్రామాల నుంచి నగరానికి వచ్చే కూరగాయల వ్యాపారులు, హాస్పిటల్, ఇతర సంస్థలో పనిచేసే వారు ఆటోలు, టాటా ఏసీ వాహనాల్లో ప్రయాణించాల్సి వచ్చింది. ఇక మంథని ఆర్టీసీ డిపో నుంచి నిత్యం నడిచే 52 బస్సు సర్వీసుల్లో సీఎం సభకు 32బస్సులను పంపించగా, కరీంనగర్, భూపాలపల్లి, గోదావరిఖని రూట్లకు వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడ్డారు.