Jagityal| రాయికల్, అక్టోబర్ 8 : మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని జడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత డిమాండ్ చేశారు. రాయికల్ పట్టణం లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరుగాలం రైతు కష్టపడి పండించిన మొక్క జొన్న పంటను కొనుగోలు చేయకుండా కొనుగోలు సెంటర్లు ప్రారంభించకుండా రైతులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందన్నారు. కనీసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే స్థితిలో ఈ ప్రభుత్వం లేదా అని ప్రశ్నించారు.
ఆనాడు రైతు బాంధవుడు కేసీఆర్ సకాలంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, మద్దతు ధర కల్పించి రైతుకు నష్టం కాకుండా దళారి వ్యవస్థ లేకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేసిన ఘనత కేసిఆర్ గారిదన్నారు. అకాల వర్షాలకు తడిచిన మొక్కజొన్న పంటను కూడా ఎలాంటి నిబంధనలు లేకుండా కొనుగోలు చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో దళారులకు రైతులు అమ్మడం తో రైతుకు ఒక క్వింటాల్‌కు రూ.600 నుండి 800 వరకు నష్టంతో అమ్ముకుంటున్నారన్నారు.
ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి ఈ నష్టాన్ని కూడా రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆనాడు ఓట్ల కోసం అన్ని పంటలకు మద్దతు ధర మరియు బోనస్ కల్పిస్తానని బోగస్ మాటలు చెప్పి గద్దె ఎక్కిన తర్వాత రైతుకు మొండి చేయి చూపిస్తున్నారన్నారు. వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పి 22 నెలలైనా కూడా ఇప్పటికే ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. ఉచిత బస్సు పథకం పెట్టి బస్సుల సంఖ్య తగ్గించి చార్జీలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని మండిపడ్డారు. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఈ ప్రభుత్వం మోసం చేసిందనీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి రైతులతో పాటు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలందరూ తీవ్రంగా విసిగి పోయినారని, మళ్లీ కేసీఆర్ పాలన కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. జగిత్యాల నియోజకవర్గం లో స్థానిక సంస్థ ఎన్నికల్లో గులాబీ జెండా తప్పకుండా ఎగరడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయికల్ పట్టణ, మండల అధ్యక్షులు ఎలేటి అనిల్, బర్కం మల్లేష్, కో ఆర్డినేటర్ తురగ శ్రీధర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సాయి కుమార్, మహేష్ గౌడ్, మహేందర్, మాజీ కో ఆప్షన్ సోహెల్, మాజీ ఎంపీటీసీ రాజేందర్ గౌడ్, నాయకులు రామచంద్రం, వినోద్, తదితరులు పాల్గొన్నారు.