KARIMNAGAR | కార్పొరేషన్, ఏఫ్రిల్ 3 : ఎల్ఆర్ఎస్ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు భారీగా ఆదాయం వచ్చింది. రాష్ట్ర ప్రబుత్వం ప్రకటించిన రాయితీని వినియోగించుకోవటానికి దరఖాస్తుదారులు ఆసక్తి చూపటంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పరిష్కారానికి నోచుకున్నాయి. దీంతో ఆయా దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించటంతో భారీగా ఆదాయం చేకూరింది.
అయితే ఈ ఆదాయం మొత్తంగా ప్రభుత్వ ఖాతాకు జమ అవుతుందతని అధికారవర్గాలు చెప్పుతున్నాయి. వాస్తవానికి ఈ డబ్బులన్ని కూడా ఆయా మున్సిపాలిటీల ఖాతాల్లో జమ అయితే ఆయా మున్సిపాలిటీల అభివృద్ది నిధులు భారీ వచ్చినట్లు అవుతుంది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వద్దకు వెళ్లితే ఆ నిధులు ఎప్పుడు వస్తాయోనని ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకుంటుంది.
గతంలో ఎల్ఆర్ఎస్ నిధులన్ని కూడ మున్సిపాలిటీలకు చెందటంతో ఏయే డివిజన్లు, వార్డుల నుంచి నిధులు వచ్చాయో ఆయా డివిజన్లు, వార్డులో 50 శాతం నిధులను అక్కడ అభివృద్దికి వ్యయం చేయటంతో పాటుగా మిగిలిన 50 శాతం నిధులను ఆయా నగర, పట్టణ ప్రాంతాల అభివృద్దికి వినియోగించే వారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ నిధులు మంజూరు చేస్తే కానీ ఆయా పట్టణాల్లో అభివృద్దికి నిధులు వచ్చే అవకాశం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో రూ.92 కోట్ల వసూళ్లు
కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కింద 1.36 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉండగా ఇందులో ఇప్పటి వరకు 28 వేలకు పైగా దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించారు. వీటి ద్వారా సుమారుగా రూ.92 కోట్ల మేరకు ఆదాయం చేకూరింది. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో 3786 దరఖాస్తుల ద్వారా రూ.22.54 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది.
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో మొత్తంగా 29558 దరఖాస్తులు రాగా వీటిల్లో 205 దరఖాస్తులను తిరస్కరించారు. ఇప్పటి వరకు 3786 మంది దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించగా రూ.22.54 కోట్లు ఆదాయం వచ్చింది. మొత్తంగా కరీంనగర్ జిల్లాలోని డెవలప్మెంట్ అథారిటీలు, మున్సిపాలిటీల్లో కలిపి 48 వేలకు పైగా దరఖాస్తులు ఉండగా 9826 మంది దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించగా రూ.39.27 కోట్లు వచ్చింది.
అలాగే జగిత్యాల జిల్లాకు సంబంధించి 32 వేలకు పైగా దరఖాస్తుల్లో 5149 మంది చెల్లించగా రూ.14.85 కోట్లు, పెద్దపల్లి జిల్లాలో 19 వేలకు పైగా దరఖాస్తుల్లో 5247 దరఖాస్తుదారులు చెల్లించగా రూ.20.25 కోట్లు, సిరిసిల్ల జిల్లాలో 36 వేలకు పైగా దరఖాస్తులు రాగా వీరిలో 7735 దరఖాస్తుదారులు చెల్లించగా రూ.17.33 కోట్లు వచ్చాయి.
వీటిని నిబంధనల మేరకు ఆయా మున్సిపాలిటీల్లో ఖాతాల్లోనే నిధులను జమ చేస్తే ఆయా మున్సిపాలిటీల్లో అభివృద్దికి అవకాశం ఉంటుంది. ఈ ఆదాయంపై కన్నేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రాయితీ పథకాన్ని ఈ నెలాఖారు వరకు పొడగించటంతో మరింత ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తుంది.