కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 6 : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సుదీర్ఘకాలం కొనసాగిన ఎన్నికల కోడ్ గురువారంతో ముగిసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం సాయంత్రం కోడ్ ఎత్తివేస్తూ, ఉత్తర్వులు విడుదల చేసింది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సీఈసీ, ఆ వెంటే కోడ్‌ను కూడా అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించింది. సుమారు రెండు నెలల ఇరవై రోజుల పాటు ఎన్నికల నియమావళి ఉండగా, సాధారణ ప్రజలు కొంతమేర ఇబ్బంది పడాల్సి వచ్చింది.
పేద, మధ్య తరగతి ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి కోడ్ కారణంగా తాత్కాలిక బ్రేక్ పడ్డది. దీంతో ప్రజా సమస్యల పరిష్కారం పెండింగ్‌లో పడింది. ఇప్పుడు కోడ్ ఎత్తివేయడంతో ఇకనైనా తమ సమస్యలపై జిల్లా అధికారులు దృష్టి సారిస్తారని జిల్లా ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే, రైతు రుణమాఫీ, కొత్త పింఛన్లు, రేషన్‌కార్డుల మంజూరుపై కూడా ప్రభుత్వం హామీ ఇవ్వడంతో రైతులు, సామాన్యులు వేచిచూస్తున్నారు.