LIC employees | కోల్ సిటీ, జూలై 9: భారతీయ జీవిత బీమా సంస్థ రామగుండం శాఖ ఉద్యోగులు బుధవారం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు, కార్మిక హక్కులు కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని భారతీ జీవిత బీమా క్లాస్ 3.4 ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఒకరోజు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకవస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి నాడు పోరాడి సాధించుకున్న పాత చట్టాలనే తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏళ్ల తరబడి వస్తున్న ఉద్యోగ, కార్మిక హక్కులను అణచివేసే కుట్రలో భాగంగానే నాలుగు లేబర్ కోడ్స్ తీసుకవస్తుందని ఆరోపించారు. ఇకనైనా కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని సూచించారు.
కాగా, ధర్నాకు జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య (1964) రామగుండం శాఖ తరపున మద్దతు ప్రకటించారు. కార్యకమంలో రవికాంత్, శివకుమార్, అంబాల మచ్చగిరి, దుర్గారావు, అరుణ, అనురాధ, ఏజెంట్ల సంఘం అధ్యక్షులు జనగామ సదయ్య, ఆర్థిక కార్యదర్శి అంబాల బాబు, తిరుపతి రెడ్డి, కొల్లూరి మహేశ్, ప్రశాంత్, రాజేష్, కృష్ణమోహన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.