Library, staff | జగిత్యాల, మే 15 : చాలీ చాలని వేతనాలతో, పెన్షన్ డబ్బులతో కాలం వెళ్లదీస్తున్న గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్ డబ్బులు గత రెండు నెలల నుంచి రాక కుటుంబ పోషణ భారంగా మారిందని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ర్టకార్యదర్శి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల, పెన్షనర్ల సమావేశం గురువారం నిర్వహించారు.
ఈ సమావేశంలో హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రతి నెల సక్రమంగా వేతనాలు రాక పోవడంతో గ్రంథాలయ సంస్థల ఉద్యోగులు, పెన్షనర్లు నిత్యావసర సరుకుల కోసం, వైద్య సేవల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉందన్నారు. మీ వేతనాలు, పెన్షన్లు వస్తాయని నమ్మకం మాకు లేదని అప్పులు, అరువు దొరక్క పస్థులు ఉండాల్సిన దయనీయ పరిస్థితిలో గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, పెన్షనర్లు కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే గ్రంథాలయ సంస్థల ఉద్యోగులకు రెండు మాసాల వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ తో రాష్ట్ర ఆర్ధికమంత్రి భట్టి విక్రమార్కకు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ లకు ఫ్యాక్స్ ద్వారా వినతిపత్రం హరి ఆశోక్ కుమార్ పంపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్, ఉపాధ్యక్షుడు వెల్ముల ప్రకాష్ రావు, కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం, ఆర్గనైజింగ్ కార్యదర్శి కే.సత్యనారాయణ, నాయకులు నీలగిరి జగదీశ్వర్ రావు, కే.మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు.