Vijay Devarakonda | టాలీవుడ్ సెన్సేషనల్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వీరిద్దరి పెళ్లి గురించి వస్తున్న వార్తలు వైరల్ అవుతున్న సమయంలో, ఎనిమిదేళ్ల క్రితం విజయ్ దేవరకొండ చేసిన ఒక పాత ట్వీట్ ఇప్పుడు నెట్టింట మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అప్పట్లో సరదాగా చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు నిజం కావడం డెస్టినీలా ఉందని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన సినిమా ‘గీత గోవిందం’. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అప్పటినుంచి వీరి మధ్య మంచి బాండింగ్ ఉందనే వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి.
2018 జూన్ 23న ‘గీత గోవిందం’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా విజయ్ దేవరకొండ ఒక ట్వీట్ చేశారు. సినిమాలో రష్మికను భుజాన ఎత్తుకుని నడిచే సన్నివేశాన్ని ఉద్దేశిస్తూ ఆయన “నా కాళ్లు తిమ్మిరి ఎక్కినా, నడుము నొప్పి వచ్చినా మీ బరువు బాధ్యత ఎప్పుడూ నాదే మేడమ్” అని రాసుకొచ్చారు. అప్పట్లో ఈ ట్వీట్ కేవలం సినిమా ప్రమోషన్లో భాగంగా చేసిన సరదా వ్యాఖ్యగా భావించారు. అయితే ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆ పాత ట్వీట్‌ను నెటిజన్లు మళ్లీ బయటకు తీసుకొచ్చారు. “అప్పుడే మాట ఇచ్చేశావా విజయ్?” అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ ట్వీట్ మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది.
ఇటీవల విజయ్ దేవరకొండ తన సొంత ఊరిలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించడం, గ్రామస్తులకు భోజనాలు పెట్టడం వంటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత వీరిద్దరి వివాహం గురించి వార్తలు మరింతగా ప్రచారంలోకి వచ్చాయి. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ, ‘నేషనల్ క్రష్’గా గుర్తింపు పొందిన రష్మిక మందన్న కలిసి నటించినప్పుడు తెరపై అద్భుతమైన కెమిస్ట్రీ చూపించారు. అదే కెమిస్ట్రీ నిజ జీవితంలో కూడా ఉందని వారి సన్నిహితులు చెబుతున్నారు. అయితే కప్పుడు సినిమా ప్రమోషన్ కోసం చేసిన ట్వీట్ ఇప్పుడు ఒక అందమైన ప్రేమకథకు నిదర్శనంగా నిలిచిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.