Library books | కోరుట్ల, జూలై 30: ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయులు బోధనాభ్యాసనలో లైబ్రరీ పుస్తకాలను ఉపయోగించాలని స్కూల్ కాంప్లెక్స్ స్టేట్ రిసోర్స్ పర్సన్ కటుకోజ్వల మనోహరి చారి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ప్రాథమిక మండల స్థాయి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల టైంటేబుల్లో లైబ్రరీ విద్య కోసం తరగతులు కేటాయించాలన్నారు.
ప్రతి విద్యార్థి లైబ్రరీలోని పుస్తకాలపై అవగాహన కలిగి ఉండేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలన్నారు. తెలుగు ఉపాధ్యాయులకు తెలుగు భాష బోధనాంశాలపై సలహలు, సూచనలు అందజేశారు. ఆనంతరం విద్యార్థుల అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలు, బోధనలో మెరుగైన పద్ధతులు, విద్యా ప్రమాణాలు పెంపొందించడం, పరీక్ష ఫలితాల్లో విద్యార్థుల ప్రగతి వంటి అంశాలపై చర్చించారు. ఈకార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కృష్ణ మోహన్ రావు, రీసోర్స్ పర్సన్లు భానుమూర్తి, నేరేళ్ల రామకృష్ణశాస్త్రి, సీఆర్పీలు గంగాధర్, తెలుగు ఉపాద్యాయులు పాల్గొన్నారు.