మెట్పల్ల్లి, డిసెంబర్ 2 : ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుదామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రతినిధులు, ముఖ్యకార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ నేతృత్వంలో కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత దిశానిర్దేశం చేశారు. అధికారం లేదని కార్యకర్తలు డీలా పడొద్దని, కేసులకు భయపడొద్దని, కార్యకర్తలకు లీగల్‌సెల్ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వివరించాలని సూచించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా కొట్లాడుదామని, సర్కారు వాళ్లదే అయినా గెలిచే సత్తా మనకే ఉందన్నారు. కేసీఆర్ అనే మొక్కను పీకేస్తానని రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడని, కేసీఆర్ మొక్క కాదని, ఆయన ఒక వేగు చుక్క అని స్పష్టం చేశారు. రేవంత్ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తు చేశారు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు నిధులు వరదల్లా పారాయని, ఇప్పుడున్న ప్రభుత్వంలో తిట్లు పారుతున్నాయని, ‘యథారాజా తథా ప్రజా’ అన్నట్టు ముఖ్యమంత్రి, మంత్రులు తిట్ల దండకమే తప్ప మరొకటి లేదని విమర్శించారు.
సమావేశంలో ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్పల్లి, కోరుట్ల మండల శాఖ అధ్యక్షులు ఎలాల దశరథరెడ్డి, తోట శ్రీనివాస్, నల్ల తిరుపతిరెడ్డి, దారిశెట్టి రాజేశ్, మాజీ ఎంపీపీలు మారు సాయిరెడ్డి, జాజాల భీమేశ్వరి, నాయకులు జేడీ సుమన్, దేవ మల్లయ్య, ఏనుగు రాంరెడ్డి, పుప్పాల నర్సయ్య, రాజారెడ్డి, దోమకొండ చిన్న రాజన్న,రాయల్, అంజయ్య, జగన్రావు, పుల్ల జగన్, బద్దం శేఖర్‌రెడ్డి, నోముల లక్ష్మారెడ్డి, కందరి ప్రతాప్‌రెడ్డి, ఆరేళ్ల రాజాగౌడ్, ఆకుల రాజారెడ్డి, జగన్మోహన్రెడ్డి, రవి, నత్తి రాజ్‌కుమార్, కంటం రమేశ్, మామిడి సురేశ్‌రెడ్డి, దొంతుల తుకారాం, పీసు తిరుపతిరెడ్డి, సాగర్, సురేందర్ పాల్గొన్నారు.