Leopard in Dharmapuri | ధర్మపురి,ఆగస్టు10: ధర్మపురి నుండి కమలాపూర్ రోడ్డులో గల పెట్రోల్ బంక్ సమీపంలో గల పోచంపంపు ఏరియాలో ఉన్న పంటపొలాల్లో చిరుతపులి కలకలం సృష్టించింది. రెండు, మూడు రోజుల నుండి ఈ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లుగా రైతులు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫారెస్ట్ బీట్ అధికారి జీవన్, సిబ్బంది చిరుత తిరిగినట్లు రైతులు తెలిపిన ప్రదేశాలను ఆదివారం పరిశీలించారు. అయితే పొలాల గట్లపై, ఇటుకబట్టీల వద్ద చిరుత సంచారం అనవాళ్లు, కాలివేళ్ల ముద్రలను సేకరించారు. అయితే జంగపల్లి, పులి పిల్లులు కూడా దూరం నుండి చూస్తే చిరుత పోలికలతోనే ఉంటాయని, ఏదీ ఏమైనప్పటికీ ధర్మపురి, రామయ్యపల్లి, కమలాపూర్, నాగారం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
పొలాల వద్దకు వెలితే గుంపులుగా వెళ్లాలని, పనిచేసే ప్రదేశాల్లో కూడా గుంపులుగా కూడి పనులు చేసుకోవాలన్నారు. వెంట శునకాలను తీసుకువెళ్లాలని అవి అడవి జంతువుల వాసనతో పసిగట్టి గట్టిగా అరుస్తాయన్నారు. శివారు ప్రాంతాల్లో ఏ జంతువు కనిపించినా పరుగెత్తవద్దని, వాటిని వెల్లగొట్టే ప్రయత్నం కూడా చేయవద్దని. ఇలా చేస్తే అవి మీదపడే ప్రమాదం ఉందన్నారు. వాటిని ఏమీ అనకుండా గమనిస్తూ ఉంటే అవే వెళ్లిపోతాయన్నారు. పొలాల వద్దనుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇంటికి చేరాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజాము సమయంలో ఎట్టిపరిస్థితుల్లో ఒంటరిగా వెల్లవద్దన్నారు. పశువులు, గొర్లను మేతకు తీసుకుపోరాదని, ఆహార అవశేషాలు, పశువుల మృతదేహాలను శివారుల్లో వేయకూడదని, శివారు ప్రాంతాల్లో ఎలాంటి జంతువులు కనిపించినా అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు.