Metpally | మెట్పల్లి రూరల్, మే 29: గోవులను అక్రమంగా రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మెట్పల్లి మండల పశువైద్యాధికారిణి డా. మనీషా తెలిపారు. మండలంలోని గండిహనుమాన్ వద్ద ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా సరిహద్దు చెక్పోస్టును గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోవులను అక్రమంగా రవాణా చేసే వాహనాలను పోలీసులు పట్టుకుంటే సంబంధిత గోవులను రిజిష్టర్ అయిన గోశాలకు సురక్షితంగా తరలించాలని, అలాగే రవాణా చేస్తున్న వారితో పాటు క్రయ, విక్రయదారులపై కూడా కేసు నమోదు చేయాలని సూచించారు.
పశు సంరక్షణ చట్టం 1977 ప్రకారం గోవులను, దూడలను ఎట్టి పరిస్థితుల్లో చంపకూడదని, ఎద్దు, దున్న, గేదె తదితర వాటిని చంపాలంటే వాటి వయస్సు తప్పనిసరిగా 14 ఏళ్లు పైబడి ఉండాలన్నారు. అంతే కాకుండా వ్యవసాయానికి, బ్రీడ్ డెవలప్మెంట్కు పూర్తి నిరుపయోగంగా ఉన్నాయని ప్రభుత్వ పశువైద్యుడు ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని తెలిపారు.
పశువైద్యుడి ధ్రువీకరణ పత్రమున్నట్లయితే ప్రభుత్వ అనుమతి ఉన్న పశువధశాలల్లో మాత్రమే పశువులను వధించాలని, ఇళ్లల్లో, ఇతర చోట్ల పశువులను వధించడం, మాంసాన్ని విక్రయించడం నేరమని స్పష్టం చేశారు. పశువుల క్రయ, విక్రయదారులు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.