Ramagundam Baldia | కోల్ సి టీ, మే 26 : రామగుండం నగర పాలక సంస్థ సివిల్ కాంట్రాక్టర్ల మధ్య విభేదాలతో ‘రోడ్డె’క్కుతున్నారు. బడా కాంట్రాక్టర్ల ఆదిపత్యం మూలంగా చోటామోటా కాంట్రాక్టర్లకు పనులు దక్కని పరిస్థితి నెలకొంది. నగర పాలక సంస్థ పరిధిలోని ఆయా డివిజన్లలో ఇటీవల రోడ్డు, ఇతరత్రా పనులకు టెండర్లు ఆహ్వానించారు. ఈ టెండర్లను దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు పోటాపోటీ పడుతున్నారు.
దీనిలో భాగంగా ఈనెల 22న నగర పాలక సంస్థ 7వ డివిజన్ పరిధిలో యూజీడీ పనులకు టెండర్లు పిలిచారు. ఈనెల 28వ తేదీ వరకు టెండర్ల దాఖలకు గడువు ఉంది. ఏడో డివిజన్ పరిధిలోని రామగిరి మాలతి ఇంటి వద్ద నుంచి రాజేశ్వర రావు వెంచర్ వరకు, అలాగే వేగోళపు ధనుంజయ ఇంటి నుంచి హనుమాండ్ల భాగ్యలక్ష్మి ఇంటి వరకు 15వ ఆర్థిక సంఘం ద్వారా సుమారు రూ.11.68 లక్షలతో రోడ్డు నిర్మాణంకు టెండర్ పిలిచారు.
ఐతే సదరు డివిజన్ కు చెందిన ఓ కాంట్రాక్టర్ మా డివిజన్ పనులు కాబట్టి మేమే దగ్గరుండి చేయించుకుంటామనీ, ఈ పనుల్లో ఎవరు కూడా జోక్యం చేసుకోవద్దని, ఎవరు కూడా టెండర్ వేయవద్దంటూ సదరు కాంట్రాక్టర్ మిగతా కాంట్రాక్టర్లకు సోమవారం సందేశాలు పంపించడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఏలాంటి పనులకైనా కాంట్రాక్టర్లు ఎవరికి వారుగా టెండర్లు దాఖలు చేసే ఆనవాయితీ ఉంది.
కానీ గతంలో లేనివిధంగా కొత్త ఒరవడికి బడా కాంట్రాక్టర్లు తెర తీయడం వల్ల తమ పరిస్థితి ఏమిటని మిగతా చోటా కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. టెండర్లో పాల్గొనవద్దంటూ సదరు కాంట్రాక్టర్ మిగతా వారికి సందేశాలు పంపించడం వివాదానికి దారి తీస్తుంది. ఈ విషయంలో నగర పాలక ఇంజనీరింగ్ అధికారులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.