PRAJAVANI | కరీంనగర్ కలెక్టరేట్, నవంబర్ 10 : కౌలుకు ఇచ్చిన భూమిని తన పేరిట మార్పించుకుని దర్జాగా పట్టా చేయించుకున్న వ్యక్తికే అధికారులు మద్దతునిస్తున్నారని ఆరోపిస్తూ, కలెక్టరేట్ నిర్వహించిన ప్రజావాణి పరిసరాల్లో పురుగుల మందు డబ్బాలతో బాధితులు ఆందోళనకు దిగారు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా మూడేళ్ల నుంచి తిరుగుతున్నా, మా భూమి మాకు ఇప్పించటంలేదని వాపోతూ, బాధిత కుటుంబాల్లోని సభ్యులు ఆడిటోరియం పరిసరాల్లో నిరసనకు దిగారు.
రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేసేదాకా వెనక్కు తగ్గేది లేదంటూ ఆడిటోరియానికి వెళ్లే దారిపై బైఠాయించారు. రెవెన్యూ అధికారులు తమ పట్ల అనుచితంగా వ్యవహరించిన తీరును ఏకరువు పెడుతూ కలెక్టర్ మా దగ్గరకు రాకుంటే పురుగుల మందు తాగుతామంటూ మందు డబ్బాలు ప్రదర్శించటంతో ఆందోళనకారుల గొడవ, పోలీసుల వారింపుతో ఆడిటోరియం పరిసరాలు సోమవారం మద్యాహ్నం దద్దరిల్లాయి.
వివరాల్లోకి వెళ్తే.. గన్నేరువరం మండలంలోని గోపాల్పూర్ గ్రామానికి చెందిన కొంపెల్లి అయిలయ్య, వీరయ్య, నర్సయ్య, రాములు అనే నలుగురు అన్నదమ్ములకు గ్రామంలోని సర్వే నెంబర్ 179లో 8ఎకరాల39 గుంటల భూమి ఉంది. కాగా ఇందులో 5ఎకరాల 36 గుంటల భూమి ఇదే గ్రామానికి చెందిన సిరిగిరి కనుకయ్య అనే వ్యక్తి తన పేర పట్టా చేయించుకున్నాడని బాధితు కుటుంబాల సభ్యులు పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం నుంచి అతని పేర పట్టా మారినట్లు రికార్డుల్లో ఉండగా, తమను భూమిలోకి రానివ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై గతంలోనే తాము పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదుచేశామన్నారు.
సమస్య పరిష్కరించకుండా తమనే కులం పేరుతో దూషిస్తూ, రెవెన్యూ అధికారులు బెదిరింపులకు పాల్పడుతుండగా, ప్రజావాణికి వచ్చి పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. వెంటనే పరిష్కరించాలంటూ తహసీల్దార్‌కు కలెక్టర్ లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేసినా, ఇప్పటివరకు తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాడోపేడో తేల్చుకునేందుకు ప్రజావాణికి వస్తే కలెక్టరమ్మ సైతం అధికారుల మాటలే నమ్ముతుందని కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులంతా ఏకమై భూకబ్జాదారులకే మద్దతు తెల్పుతున్నారని ఆరోపిస్తూ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగే ప్రయత్నం చేస్తుండగా, పోలీసులు అడ్డుకున్నారు. వారి వద్ద నుంచి పురుగుల మందు డబ్బాలు లాక్కొని కింద పోసి, ఖాళీ డబ్బాలు భవనం పైకి విసిరేశారు.
సుమారు గంటకు పైగా బాధితులు ఆడిటోరియం ఆవరణలో హంగామా చేయటంతో ప్రజావాణిలో ఫిర్యాదులు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా మద్దతుగా నిలిచారు. రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాధిత ఆందోళనకారులకు అవుట్ పోస్టు పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వగా, తమను కలెక్టర్‌కు కలిపించి, న్యాయం చేయాలంటూ వేడుకోవటం కనిపించింది. విషయం తెల్సుకున్న ఒకటో పట్టణ పోలీసులు ప్రజావాణి నిర్వహించే ఆడిటోరియం పరిసరాల్లోకి చేరుకుని బాధితులను సముదాయించి, ఇంటికి తిప్పి పంపారు. అనంతరం ప్రజావాణి పరిసరాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.