కోల్‌సిటీ, జూలై 10 : రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని సప్తగిరి కాలనీ శివారు, శ్రీనగర్ కాలనీ పరిధిలో స్లాటర్ హౌస్ (జంతు వధశాల) పునర్నిర్మాణానికి బీఆర్ఎస్ హయాంలో అడుగు పడింది. 2023లో టీయూఎఫ్ఐడీసీ ద్వారా స్లాటర్‌హౌస్ పునర్నిర్మాణంతోపాటు యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)తోపాటు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం 1.80కోట్ల నిధులు కేటాయించింది. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పనులు మధ్యలో ఆగిపోయాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత స్లాటర్ హౌస్, వీధి కుక్కల నియంత్రణ కేంద్రం, సిమెంట్ రోడ్డు పనులు పూర్తయ్యాయి.
అయితే పర్యవేక్షణ లోపమో..? మరేదో తెలియదు గానీ నెల రోజుల క్రితం రాత్రికిరాత్రే స్లాటర్ హౌస్, వీధి కుక్కల నియంత్రణ కేంద్రం భవనాలకు సంబంధించి లక్షల విలువ చేసే ఇనుప కిటికీలు, తలుపులు, విలువైన సామగ్రి మాయమయ్యాయి. పునఃప్రారంభానికి ముందే జరిగిన ఈ చోరీ ఒక మిస్టరీలా మారింది. ఇది అధికారులకు తలనొప్పిగా పరిణమించింది. చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నా, చోరీ జరిగి రోజులు గడుస్తున్నా దొంగలు దొరకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ఈ విషయమై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీని సంప్రదించగా, చోరీపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని చెప్పారు. కాకపోతే దొంగలు ఎవరనేది స్పష్టం కావడం కాలేదన్నారు. త్వరలోనే స్లాటర్ హౌస్‌ను వినియోగంలోకి తీసుకువస్తామని తెలిపారు.