వేములవాడ, జూన్ 3: వేములవాడ రాజన్న భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూకు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం వివాదంగా మారుతున్నది. సరుకుల కొనుగోలు, తయారీ, విక్రయాలపై వచ్చిన ఫిర్యాదులో భాగంగా ఏసీబీ గతేడాది ఆగస్టులో ఆకస్మికంగా తనిఖీలు చేయగా, అవినీతి బట్టబయలైంది. అయితే, సమగ్ర దర్యాప్తు చేసిన ఏసీబీ శాఖ ఈ యేడాది మార్చిలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను కూడా అందజేసింది. రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ రాజన్న ఆలయంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా శాఖా పరమైన విచారణ జరిపి, తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ నెల 2న కమిషనర్ కార్యాలయాన్ని లేఖ ద్వారా ఆదేశించింది. ఇక ఈ వ్యవహారంలో ఏడుగురు ఉద్యోగులపై చర్యలకు దేవాదాయ శాఖ రంగం సిద్ధం చేసింది.
బట్టబయలైన అవినీతి
రాజన్న లడ్డూ ప్రసాదం తయారీకి సంబంధించి మూడు విభాగాల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఇప్పటికే ఏసీబీ శాఖ నిర్ధారించింది. గోదాములోని 24 రకాల సరుకుల వ్యత్యాసాలను.. అందులో ప్రధానంగా కాజు 144 కిలోలు, కిస్మిస్ 88 కిలోలు, నెయ్యి 981 కిలోలు, బియ్యం 908 కిలోలు వీటితోపాటు మరో 13 రకాల సరుకుల నిల్వలు తేడాగా ఉన్నాయని సామాజిక మాధ్యమాల ద్వారానే వెల్లడించిన విష యం తెలిసిందే. గోదాం నిల్వల వ్యత్యాసంతోపాటు తయారీ, అమ్మకాలలోనూ అనేక వ్యత్యాసాలు, అవినీతి జరిగినట్టు ఏసీబీ తన నివేదికలో పేరొన్నట్టు తెలుస్తున్నది. మొత్తం ప్రసాదం తయారీ చుట్టే ఈ వివాదం ముడిపడి ఉన్నట్టు అధికారుల విచారణతో తెలుస్తున్నది.
ఏడుగురిపై చర్యలు!
ఏసీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ ఏడుగురు ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు సిఫారసు చేసింది. ఈ లేఖ ఈ నెల 2న కమిషనర్ కార్యాలయానికి చేరినట్లు తెలిసింది. అందులో ఏసీబీ అధికారుల తనిఖీల్లో విధుల్లో ఉన్న గోదాం పర్యవేక్షకుడు, గోదాంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్, లడ్డూ ప్రసాదాల తయారీ విభాగం పర్యవేక్షకుడు, లడ్డూ ప్రసాదాల విక్రయశాలలో ఉన్న జూనియర్ అసిస్టెంట్, కల్యాణ కట్టలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు రికార్డ్ అసిస్టెంట్లపై శాఖా పరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సదరు రాజన్న ఆలయ కార్యనిర్వహణ అధికారిగా ఉన్న అధికారితో కలిపి మొత్తం ఏడుగురిపై చర్యలు తీసుకునేందుకు దేవాదాయ శాఖ రంగం సిద్ధం చేస్తున్నది. అయితే, చార్జీ మెమోలు జారీ చేసి శాఖా పరమైన విచారణ జరపాల్సిందిగా కూడా ఆదేశించినట్లు తెలిసింది. దీంతో రాజన్న ఆలయ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.