Korutla | కోరుట్ల, జనవరి 24: భవన నిర్మాణ రంగ కార్మికులు లేబర్ కార్డును సద్వినియోగం చేసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలోని మాదాపూర్ కాలనీలో పార్టీ నూతన కార్యాలయాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుడికి 18 సంవత్సరాలు నిండి 58 ఏళ్ల వరకు ఉన్న ప్రతీ లేబర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్డు ద్వారా కార్మికుడి కూతురు పెళ్లికి రూ.30 వేలు, ప్రసూతి సౌకర్యానికి రూ.30 వేల ఆర్థిక సాయం రెండు కాన్పుల వరకు వర్తిస్తుందన్నారు.
ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే రూ.10 లక్షలు, సహజ మరణానికి రూ.రెండు లక్షల సాయం కార్మిక కుటుంబానికి అందుతుందని చెప్పారు. లేబర్ కార్డు కోసం ప్రతీ కార్మికుడు బ్యాంకు పాస్ బుక్, రేషన్ కార్డు జిరాక్స్ తో కుటుంబసభ్యులందరి పేర్లు జత చేసి లేబర్ ఆఫీసర్ కు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం, ఏఐటీయూసీ కార్యదర్శులు ఎండీ ముక్రం, రాధ, ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి రామిల్ల రాంబాబు, ఎండి అలీ, చెన్న శ్రీనివాస్, అందే వంశీకృష్ణ, మహేష్, జాకీర్, అబ్దుల్ వజిత్, కలీం పాషా, షేక్ ముఖిమ్, హాజర్, రుద్రంగి లక్ష్మీ, వాణి అంజమ్మ, ఆంధ్ర శీను తదితరులు పాల్గొన్నారు.