రాజన్న సిరిసిల్ల, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్: కేసీఆర్ చేసిన పోరాటాలు, బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన త్యాగాలను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారని కొనియాడారు. ఆయన నాటిన మహావృక్షమే బీఆర్ఎస్ అని, ఎవరూ భయపడవద్దని, రాబోయే రోజుల్లో మన పార్టీకి, మనకు ఉజ్వల భవిష్యత్తు ఉందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ మోసాలకు ప్రజలు బాధపడుతున్నారని, ఎక్కడ చూసినా, ఎవరిని కదిలించినా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నరని, మళ్లీ మనమే రావాలని కోరుకుంటున్నరని, రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో మంగళవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అధ్యక్షతన నిర్వహించిన దీక్షా దివస్ సన్నాహక సమావేశానికి ఆయన హాజరై దిశానిర్దేశం చేశారు. దీక్షా దివస్‌కు జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ జీవితంలో కష్టాలు రావడం సహజమని, అవి దాటుకుంటూ ముందుకు వెళ్దామని శ్రేణులకు నిర్దేశం చేశారు. తెలంగాణకు బీజేపీ చేస్తున్న అన్యాయాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగట్టాలని పిలుపు నిచ్చారు. కొంతమంది బీఆర్ఎస్ ఉంటదా.. పోతుందా..? అన్న అవాకులు, చెవాకులు పలికారని, అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
తనకు బలమైన విశ్వాసం ఉందని, కేసీఆర్ లాంటి బలమైన నాయకుడు నాటిన మహావృక్షమే బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. కేసీఆర్ అనే మొక్కను మొలవనివ్వమని చెబుతున్నవారికి పాలమూరులోని ఊడలమర్రి విశిష్టత ఏమిటో గుర్తుచేశారు. అలాంటి మహావృక్షమే కేసీఆర్ అని, బీఆర్ఎస్ కార్యకర్తలను ఊడలుగా తయారు చేశాడని చెప్పారు. కేసీఆర్‌ను విమర్శించే చిల్లర వెదవల గురించి పట్టించుకునే అవసరం మనకు లేదన్నారు. బీఆర్ఎస్ను తుడిచేస్తాం, పొడిచేస్తాం అన్నోళ్లు ఒక్కడు కూడా కనిపిస్తలేడని ఎద్దేవా చేశారు. అలాగే ఇప్పుడు అధికారాన్ని చూసి పెట్రేగిపోతున్న వాళ్లకు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. కేసీఆర్‌తో పెట్టుకున్నోడు ఎవడూ బాగుపడలేదని, భవిష్యత్‌లో మీరే చూస్తారని ధైర్యం చెప్పారు. కార్యకర్తల్లో ఉన్న ఉత్సాహాన్ని రెట్టింపు చేయాలని, జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ భరోసా కల్పించాలని నాయకులకు సూచించారు. తనను ఎలాగైనా పట్టుకొని అరెస్ట్ చేయాలని రేవంత్‌రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా భయపడేది లేదని, అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముల అండ ఉన్నంత వరకు ఎవని అయ్యకు భయపడకుండా ప్రజల కోసం పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
రేవంత్‌రెడ్డికి రక్షణ కవచం సంజయ్
మన పోరాటం ఒక కాంగ్రెస్‌తోనే కాదని తెలంగాణను మోసం చేసిన భారతీయ జనతా పార్టీని కూడా ఎండగట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణకు గతంలో నలుగురు ఎంపీలు ఉన్నా, ఈ సారి 8మంది ఎంపీలు ఉన్నా రాష్ర్టానికి నయాపైసా తేలేదని, ఆ విషయాన్ని గ్రామగ్రామానా ప్రచారం చేయాలని సూచించారు. సొల్లు కబుర్లతో ప్రజల్ని మోసం చేస్తున్న నాయకులను సైతం నిలదీయాలని పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డికి రక్షణ కవచంలా బీజేపీ పనిచేస్తున్న విషయాన్ని ప్రజలకు విడమరిచి చెప్పాలన్నారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ ఆర్ఎస్ బ్రదర్స్‌లా వ్యవహరిస్తున్నారని, రేవంత్‌రెడ్డి అభిమాన సంఘానికి బండి రాష్ట్ర అధ్యక్షుడని ఎద్దేవా చేశారు.
హైడ్రా పేరు మీద హైదరాబాద్‌లో చిన్న చిన్న పేదల ఇండ్లు కూల్చితే రేవంత్‌రెడ్డి మంచి పనిచేస్తున్నాడని సంజయ్, రఘునందన్‌రావు మెచ్చుకోవడంపై మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి అవినీతి, ఆరు గ్యారెంటీల అమలుపై అడిగేటోళ్లు లేరంటూ బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ వ్యవహార తీరుపై ప్రజలకు వివరించి చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. సంజయ్ వేములవాడ పర్యటనను కాంగ్రెసోళ్లు అడ్డుకోబోయారన్నది అవాస్తవని, అభిమాన సంఘం అధ్యక్షుడు వస్తాడన్న ఉత్సాహంతోనే కాంగ్రెస్ కార్యకర్తలు వ్యవహరించారని విమర్శించారు. వీరిద్దరి ఒప్పందంపై గ్రామాల్లో అన్ని చోట్ల చర్చలు జరిగేలా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు.
ప్రజలు మరిచిపోరు
గుండుకు దెబ్బ తాకితే మోకాలికి మందు పెట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం మన అదృష్టమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘అసెంబ్లీ ఎన్నికలు వస్తే మేం చూసుకుంటాం. చిట్టి నాయుడు సంగతి మేం అర్సుకుంటం. లోకల్ బాడీ ఎన్నికలు వస్తే మీరు చూసుకోండని’ కార్యకర్తలకు సూచించారు. చీకటి చూస్తేనే వెలుతురు విలువ తెలుస్తుందని, కరువొస్తేనే వాన విలువ తెలుస్తుందని, గాడిదను చూస్తే గుర్రం విలువ తెలుస్తుందని, తెలంగాణలో కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత బీఆర్ఎస్ విలువ ప్రజలకు తెలిసిందని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగం, చేనేత మరమగ్గాల రంగం, విద్య, వైద్య రంగం ఎలా అభివృద్ధి జరిగిందో ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు.
సాంచాలు ఇక్కడుంటే నూలు బ్యాంకు మరోచోటనా?
వస్త్ర పరిశ్రమకు కేంద్ర బిందువైన సిరిసిల్లలో సాంచాలు ఉంటే యారన్ బ్యాంకు వేములవాడలో పెట్టిన సన్నాసి ప్రభుత్వం కాంగ్రెస్ అని కేటీఆర్ మండిపడ్డారు. నూలు బ్యాంకును వెంటనే సిరిసిల్లకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. 28సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్‌రెడ్డి రాష్ర్టానికి రూ.28 కూడా తీసుకురాలేదని, ఇక సిరిసిల్లకు ఒరగబెట్టిందేమిటని నిలదీశారు. విమాన చార్జీలు వృథా అని ఎద్దేవా చేశారు. కొడంగల్‌లో రైతుల భూములు గుంజుకుంటే నిరసన, ధర్నాలు చేసినా పట్టించుకోని మంత్రులు, అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు. అక్కడ సీఎం తమ్ముడు తిరుపతిరెడ్దిదే పెత్తనం నడుస్తుందని ధ్వజమెత్తారు. మా నేరెళ్లలో కూడా ఒక సంఘటన జరిగితే రాజకీయం చేసి లబ్ధిపొందే ప్రయత్నం చేశారని కాంగ్రెస్‌పై మండిపడ్డారు.
బాధితులకు న్యాయం చేసేందుకు తాను ప్రయత్నం చేశానని, వీలైనంత సాయం చేసినట్లు చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసి ప్రజలు మమ్మల్ని అత్యధిక మెజార్టీతో ఆశీర్వదించారని వివరించారు. అంతకుముందు కేటీఆర్ ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో రాజ్యంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మా ధవి, జడ్పీ మాజీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా గ్రంథాల య మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, ఆయా మండలాల అధ్యక్షులు, మాజీ సర్పంచు లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, నాయకులు పాల్గొన్నారు.
దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి
దీక్ష ప్రారంభించిన రోజు దీక్షా దివస్, విజయం సాధించిన రోజు విజయ దివస్‌గా జరుపుకుందాం. ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి. ఆ రోజు తెలంగాణ తల్లి రాజ్యాంగ నిర్మాత విగ్రహాలకు పాలాభిషేకం చేయాలి. కరీంనగర్, సిరిసిల్లలో నాతోపాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గౌరవ అతిథిగా హాజరవుతారు. ప్రతి మండలం, గ్రామంలో దీక్షా దివస్ కార్యక్రమాలను ఉత్సాహంగా జరపాలి. తెలంగాణ సాధించిన విజయాలను, కేసీఆర్ చేపట్టిన పోరాటాలను నేటి తరానికి వివరించేలా కార్యక్రమాలు నిర్వహించాలి.
– కేటీఆర్
ఎవరూ భయపడద్దు
అధికారం చూసి ఎగిరెగిరి పడేటోనికి మున్ముందు కేసీఆర్ పవర్ ఏంటో తెలుస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న కలెక్టర్లు, అధికారులు రాసిపెట్టుకోండి. మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే. వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేనే తీసుకుంట. కచ్చితంగా ఆ పని చేసి చూపిస్త. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ భయపడవద్దు. ధైర్యంగా ఉండండి. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు మనల్ని ఏం చేయలేరు. సిరిసిల్లలో ప్రజలు ఛీ కొట్టినా అధికారులను అడ్డుపెట్టుకుని ఎగురుతున్న సన్నాసులను గుర్తు పెట్టుకుంట. వారి సంగతి చెబుత
– కేటీఆర్
సంబురాలు కాదు సంవత్సరీకం చేస్తరు
రేవంత్‌రెడ్డి.. బాలల దినోత్సవమైనా, రాజీవ్ సద్భావన యాత్ర అయినా, ఆయన పుట్టిన రోజైనా, వేములవాడలో మీటింగ్ అయినా సరే కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. దేవుళ్లపై ఒట్లు, కేసీఆర్‌కు తిట్లు, హామీలకు తూట్లు పొడిచిండే తప్ప చేసిందేమీ లేదు. ఏడాదిలో ఏమీ సాధించలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. సంబురాలు జరుపుకోవడానికి సన్నద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సంవత్సరీకం పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా..? ఎప్పుడు పాతరపెడదామా..? అని ఎదురు చూస్తున్నారు. రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, విద్యార్థుల ఆత్మహత్యల సాక్షిగా చెబుతున్నా ఈ ప్రభుత్వ పాలనపై ఏవర్గం కూడా సంతోషంగా లేదు. చేతకాని సీఎంను ప్రజలు ఘోరంగా తిడుతున్నారు. ఏడాదిలో ఒక ముఖ్య మంత్రిని ప్రజలు ఇంతగా తిట్టడం నేనెప్పుడు చూడలేదు. ఆ తిట్లు విన్నాక రేషం ఉన్నోడైతే బిల్డింగ్ మీది నుంచి దూకి చస్తాడు.
– కేటీఆర్