సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 6 : కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం రైతుల తరఫున బరాబర్ కొట్లాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. నీళ్లు లేక ఎండిపోయిన పంటలకు ఎకరానికి 25వేల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదాకా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగేదాకా అండగా నిలుస్తామని, రేపటి నుంచి బోనస్‌పై కాంగ్రెస్‌ను నిలదీస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ వద్ద శనివారం నిర్వహించిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. వ్యవసాయంలో ఇంత సంక్షోభం నెలకొంటుందని బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన నాలుగు నెలల్లోనే మాట్లాడుకోవాల్సి వస్తుందని అనుకోలేదన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏడు పదుల వయసులో ఎర్రటి ఎండల్లో జనగామ, సూర్యపేట, నల్లగొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించి రైతన్నకు భరోసా కల్పించారన్నారు. కానీ, రేవంత్‌రెడ్డి ఐపీఎల్ మ్యాచ్‌లు అంటూ తిరుగుతున్నాడని విమర్శించారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన కేసీఆర్‌ను కాదని వ్యవసాయాన్ని దండుగ చేసే రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకుని తప్పుచేశామని రైతులు ఆవేదన చెందుతున్నారని, కేసీఆర్ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామన్న బాధలో చెప్పారు. రైతులు, నేతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారని, సిరిసిల్లలో నేతన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. నేతన్నల సంక్షేమం కోసం సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్లో కేసీఆర్ నాయకత్వంలో దీక్షలు చేపడుతామన్నారు. నిరుద్యోగ యవత కోసం ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం చేస్తామన్నారు.
కాంగ్రెస్ సృష్టించిన కరువే..
మంత్రులు, ముఖ్యమంత్రి మాటలు వింటుంటే వారి పరిజ్ఞానం ఏంటో అర్థం కావడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘కరువు వస్తే మమ్మల్ని తిడతారా?’ అని మంత్రి శ్రీధర్‌బాబు చెబుతున్న మాటలు విడ్డూరంగా ఉన్నాయని, రాష్ట్రంలో గత వానకాలం 14 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని గుర్తు చేశారు. అప్పుడు అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలన్న ఆయన అధికారంలోకి రాగానే మాట మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరువు కాలం తెచ్చింది కాదని, ఇది కాంగ్రెస్ సృష్టించిన కరువని ధ్వజమెత్తారు. పోయిన వానకాలంలో వర్షాలు సంమృద్ధిగా కురిశాయని, చెరువులు, ప్రాజెక్టులు నిండాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి బ్యారేజీ ద్వారా నీళ్లు ఎత్తిపోసి మిడ్ మానేరుకు నీరు అందించిన ఘనత కేసీఆర్‌దే అని స్పష్టం చేశారు. మిడ్ మానేరు నుంచి మల్కపేట, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేశారన్నారు. ఇప్పుడు మేడిగడ్డ నుంచి రోజుకు రెండు వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నదని, మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగితే కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతులు చచ్చినా ఫర్వాలేదు కానీ, కేసీఆర్ బదనాం కావాలన్న లక్ష్యంతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రూ.లక్ష కోట్ల దోపిడీ జరిగిందంటూ యూట్యూబ్ చానెళ్ల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ మనుగడ కోసమే కాళేశ్వరంపై అసత్యాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారని తెలిపారు. కేసీఆర్ రైతుల కష్టాలను తెలుసుకునేందుకు పంటల పరిశీలనకు వెళ్తే కాళేశ్వరం నుంచి నీళ్లు ఇస్తున్నారని, కాళేశ్వరంలో రెండు పిల్లర్లు రిపేరు చేస్తే తెలంగాణలో కరువు పరిస్థితులు ఉండేవి కాదన్నారు.
హామీలు ఏమైనయ్
కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలకు మొండి చేయి చూపిందని కేటీఆర్ విమర్శించారు. వంద రోజుల పాలనలో చేసిందేమీ లేదని మండిపడ్డారు. తులం బంగారం, 2 లక్షల రుణమాఫీ ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే సీరియస్‌గా తీసుకోవద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. క్వింటాల్‌కు 500 బోనస్ లేదని, రైతు బంధుపై స్పష్టత లేదని, రైతు రుణమాఫీకి దిక్కేలేదని ధ్వజమెత్తారు. ఆశపడి ఓటేస్తే ఎన్నికల కోడ్ పేరుతో పథకాలను అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తున్నదని దుయ్యబట్టారు. గతంలో రైతు బంధును అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని, నిజంగానే చిత్తశుద్ధి ఉంటే 500 బోనస్ ఇస్తామని ఎలక్షన్ కమిషన్‌కు రేవంత్‌రెడ్డి ఉత్తరం రాయాలని, తాము కూడా బరాబర్ లేఖ ఇస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరిస్తే ఎన్నికలైన మరుసటి రోజే ప్రతి రైతుకూ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్పై ఉందని చెప్పారు. కరీంనగర్ లాంటి పట్టణాల్లో వచ్చిన నీటి కరువు రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో రాబోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథను వినియోగించుకునే సోయి ప్రభుత్వానికి లేదని విమర్శించారు.
బోనస్‌పై నిలదీస్తాం
కాంగ్రెస్ అవలంభిస్తున్న దగాకోరు విధానాలను ప్రజలకు వివరిస్తామని కేటీఆర్ చెప్పారు. రేపటి నుంచి బీఆర్ఎస్ కండువాలు వేసుకుని కల్లాల వద్దకు వెళ్లి రైతులకు వచ్చే బోనస్‌పై కాంగ్రెస్‌ను నిలదీస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే అవసరం తమకు లేదని, ఆయన మొగోడు అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లంకె బిందెల కోసం కాకుండా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవుపలికారు. మందికి పుట్టిన పిల్లలు తమ పిల్లలు అని చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. నోటిఫికేషన్ ఇవ్వకుండానే గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు ఇస్తూ తానే ఉద్యోగాలు ఇచ్చిన అని రేవంత్‌రెడ్డి ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ రైతు రుణమాఫీ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ రామారావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చక్రపాణి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.