రాజన్న సిరిసిల్ల, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్ : “పిల్లలకు తల్లిదండ్రు లు లేనిలోటు.. జీవితంలోనే పెద్ద కష్టం.. అధైర్యపడొద్దు.. అండగా నేనుంటా. చదువు మానేయొద్దు. తన పిల్లల్లాగే చూసుకుంటా. డాక్టర్, ఇంజినీర్, లాయర్ ఏది చదువాలనున్నా చదివించి చివరి వరకు తో డుంటా” అని నేత కార్మికుడి పిల్లలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు.
అప్పుల బాధ తాళలేక శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న భైరి అమర్-స్రవంతి కు టుంబ సభ్యులను ఆదివారం రాత్రి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎలగందుల రమణ, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి వెంకంపేటలోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించి విలేకరులతో మాట్లాడారు. అనంతరం ఇటీవల మరణించిన బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలలో రాజీవ్‌నగర్‌కు చెందిన ఒగ్గు రాజేశం, సిరిసిల్లలోని నెహ్రూనగర్‌కు చెందిన పోరండ్ల సదానందం, రమేశ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దూస భూమయ్య కుటుంబాలను పరామర్శించారు.
తల్లిదండ్రుల ఆత్మహత్యలతో అనాథలైన ముగ్గురు చిన్నారులైన లహరి, శ్రీవల్లి, దీక్షనాథ్ను చూసి చలించిపోయిన రామన్న కంటతడి పెట్టారు. రోదిస్తున్న ఆ ముగ్గురిని అక్కున చేర్చుకుని ఓదార్చారు. అమర్-స్రవంతి ఆత్మహత్యకు గల కారణాలు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. రెండు జోడీల సాంచాలు వేసుకున్న అమర్ జియో ట్యాగింగ్, త్రిఫ్ట్ పథకంలో చేరిన విషయాన్ని అమర్ బావమరిది రమేశ్ వివరించారు. వెంటనే స్పందించిన రామన్న చేనేత జౌళీశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు ఫోన్ చేసి ముగ్గురు చిన్నారులను ఆదుకోవాలని అందుకు రూ.10లక్షల ఆర్థిక సాయం ఇవ్వాలని కోరారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
అమర్-స్రవంతి ఆత్మహత్య విషయం తెలుసుకుని షోలాపూర్ నుంచి సిరిసిల్లకు వచ్చిన తమ్ముళ్లు, చెల్లెళ్లు, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. బతుకమ్మ చీరెల ఆర్డర్లు లేకపోవడం వల్లనే తన బావ సాంచాలు అమ్ముకున్నాడని బావమరిది ఏడుస్తూ చెప్పాడు. చోళా మండలం ఫైనాన్స్‌లో రూ.20 లక్షలు, బయట చాలా అప్పులు తీసుకొచ్చి సాంచాలు పెట్టుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వకుండా రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ విధానాల వల్లే అమర్-స్రవంతి ఆత్మహత్య చేసుకున్నారని, కేసీఆర్ ప్రభుత్వం గనుక ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
ముగ్గురు చిన్నారుల పేరిట ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున రూ.6 లక్షలు పార్టీ ఫండ్ అందించి, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని రామన్న హామీ ఇచ్చారు. ఏ ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని చెబుతూ ఫోన్ చేయాలని లహరికి తన మొబైల్ నంబర్ ఇచ్చారు. బాగా చదువుకుని ఇతరులకు స్ఫూర్తిగా నిలిచి, పది మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
తాను సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నందనే సర్కారుకు నేతన్నలపై ప్రేమ లేదనుకుంటే వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ ప్రకటించారు. సిరిసిల్ల నేతన్నలు, వస్త్ర పరిశ్రమపై కక్ష కట్టడం రేవంత్‌రెడ్డికి సరికాదని, ఇది మంచి పద్ధతి కాదని హితవుచెప్పారు. సిగ్గు, లజ్జ, ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మానవత్వంతో బతుకమ్మ చీరెల ఆర్డర్లు ఇచ్చి నేతన్నలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నేతన్నల కోసం తన పదవిని త్యాగం చేసేందుకు ఎలాంటి అభ్యంతరమూ లేదని స్పష్టీకరించారు.
సిరిసిల్ల నేతన్నలకు న్యాయం జరిగే వరకు ప్రత్యక్ష పోరాటానికైనా వెనకాడమని, ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, అర్బన్ బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు దిడ్డి మాధవి, నాయకులు దిడ్డి రాజు, గుండ్లపల్లి పూర్ణచందర్, గుడ్ల బాలకిషన్, బొల్లి రామ్మోహన్, న్యాలకొండ రాఘవరెడ్డి, బండ నర్సయ్యయాదవ్, తదితరనాయకులు పాల్గొన్నారు.