సిరిసిల్ల టౌన్, జూలై 2 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన మాట నిలబెట్టుకున్నారు. పద్నాలుగు ఏళ్ల క్రితం కార్యకర్త కుటుంబానికి ఇచ్చిన హామీ మేరకు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 1వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త, మాజీ సర్పంచ్ పోచవేని ముత్తయ్య 2012లో మరణించాడు. ఆ సమయంలో కేటీఆర్ రగుడులోని వారి నివాసానికి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ‘అధైర్య పడవద్దు. అండగా ఉంటా’ అని భరోసానిచ్చారు. కాగా, ముత్తయ్య కూతురు రమ్య (తన్విక) వివాహం ఇటీవల నిశ్చయం కాగా, ఆ విషయం తెలియడంతో కేటీఆర్ స్పందించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆమె వివాహానికి రూ.50వేలతోపాటు వివాహ వస్ర్తాలను కానుకగా పంపించారు.
ఈ మేరకు పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి గురువారం రగుడుకు వెళ్లి రమ్యకు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ, రగుడు(సిరిసిల్లలో విలీనం కాక ముందు) గ్రామ సర్పంచ్‌గా, గ్రామ శాఖ అధ్యక్షుడుగా ముత్తయ్య అందించిన సేవలు చిరకాలం నిలిచిపోతాయని గుర్తు చేశారు. గ్రామ అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమైందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కేటీఅర్తో ముత్తయ్యకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, కౌన్సిలర్లు బూర బాలు, మొగిలి నాగరాజు, మాజీ సర్పంచ్ వొజ్జల అగ్గిరాములు, మాజీ కౌన్సిలర్ పోచవేని సత్య, వార్డు అధ్యక్షుడు బూర తిరుపతి, నాయకులు పోచవేని ఎల్లయ్యయాదవ్, గుగ్గిళ్ల అజయ్‌గౌడ్, బూర నరేశ్, గుగ్గిళ్ల సాయి ఉన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి మా నాన్న బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు. కేటీఆర్ అన్నతో కలిసి మా నాన్న బీఆర్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వారు. 2012లో మా నాన్న చనిపోయినప్పుడు కేటీఆర్ అన్న మా ఇంటికి వచ్చి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆనాడు ఇచ్చిన మాటను యాదిపెట్టుకొని నా పెండ్లికి కానుకను పంపించడం మర్చిపోలేని అనుభూతి. నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది.
– బీఆర్ఎస్ కార్యకర్త ముత్తయ్య కూతురు రమ్య