నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : ముంబై నుంచి ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు భారత జట్టులోకి వచ్చారు. ఇప్పటికీ వస్తూనే ఉన్నారు. వారిలో సర్ఫరాజ్ ఖాన్ఎంతో ప్రత్యేకం. టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్న సర్ఫూ దేశవాళీ క్రికెట్లో ఎన్నో సీజన్ల పాటు పరుగుల మోత మోగించి.. చాలా ఏండ్ల ఎదురుచూపుల తర్వాత 2024లో టెస్టు అరంగేట్రం చేశాడు. తొలి టెస్టులోనే రెండు అర్ధ శతకాలు.. నాలుగో మ్యాచ్‌లోనే అద్భుత శతకంతో తన రాకను ఘనంగా చాటుకున్నాడు. కానీ, అంతే వేగంగా జట్టుకు దూరమైన సర్ఫరాజ్ 19 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడు.
శ్రీలంకతో ఈ నెల 15 నుంచి గాలే వేదికగా మొదలయ్యే రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాలి బొటనవేలి గాయంతో సిరీస్ మొత్తానికి దూరమైన సాయి సుదర్శన్ స్థానంలో సెలెక్షన్ కమిటీ సర్ఫరాజ్‌ను ఎంపిక చేసింది. దాంతో 2024 నవంబర్‌లో న్యూజిలాండ్‌తో తన ఆరో టెస్టు ఆడిన సర్ఫరాజ్..మళ్లీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. ‘నేను జట్టులో ఇమడకపోవచ్చు.. కానీ నా శక్తిమేరకు పోరాడుతా ‘అని కొన్ని రోజుల క్రితమే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సర్ఫరాజ్, అనుకున్నది సాధించి చూపించాడు. అయితే, గత 19 నెలల కాలం సర్ఫరాజ్ కెరీర్, జీవితం ఎన్నో ములుపులు తిరిగింది.
నిజానికి సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ భారత్‌కు ఓ చేదు జ్ఞాపకం. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని నాటి జట్టు మూడు టెస్టుల్లోనూ ఓడి 0-3తో వైట్‌వాష్ అయి విమర్శలపాలైంది. నాడు జట్టులోని మిగతా ఆటగాళ్లూ ఫెయిలైనా.. బలైంది 28 ఏండ్ల సర్ఫరాజ్ మాత్రమే. ఆస్ట్రేలియాలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో జట్టులో ఉన్నా.. తనకు బరిలోకి దిగే చాన్స్ ఇవ్వలేదు. పైగా, డ్రెస్సింగ్ రూమ్ అంతర్గత సమాచారాన్ని మీడియాకు లీక్ చేస్తున్నాడని విమర్శలు ఎదుర్కొన్నాడు.
టీమ్ మేనేజ్మెంట్, సెలెక్టర్లు అతడిపై నమ్మకం కోల్పోయారని.. తిరిగి జట్టులోకి తీసుకోవడం ఇక కష్టమేనన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. కానీ, ఇవేవీ పట్టించుకోకుండా సర్ఫూ తన ఆటపైనే ఫోకస్ పెట్టాడు. భారత్-ఏ జట్టుతో కలిసి యూకే పర్యటనకు వెళ్లిన అతను ఇంగ్లండ్ లయన్స్‌లో అనధికార టెస్టులో 92 పరుగులు చేశాడు. బెకింగ్‌హామ్‌లో జరిగిన ఇంట్రాస్కాడ్ (భారత్ x భారత్-ఏ) మ్యాచ్‌లో శతకం కొట్టాడు. అయినా సెలెక్షన్ కమిటీ తనపై శీతకన్నే వేసింది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో గువాహతిలో జరిగిన రెండో టెస్టుకు ముందు టీమ్ మేనేజ్మెంట్ అతని గురించి వాకబు చేసినా సెలెక్టర్లు మాత్రం పట్టించుకోలేదు.
సెలెక్టర్లు విస్మరిస్తున్నారని తెలిసినా సర్ఫరాజ్ తన పనిపైనే ఫోకస్ పెట్టాడు. ముఖ్యంగా తనను చూడగానే ప్రతికూల భావన కలిగే బొైద్దెన దేహాన్ని కరిగించే పనిలో పడ్డాడు. తన ఆటతీరుతో పాటు ఫిట్‌నెస్‌లోనూ ఊహించని మార్పులు తీసుకొచ్చాడు. ఆహార అలవాట్లను మార్చుకుని దాదాపు 17 కిలోల బరువు తగ్గాడు. తండ్రి, కోచ్ నౌషద్ మార్గనిర్దేశంలో తీవ్రంగా శ్రమించాడు.
ముంబై కుర్లాలోని ఎంసీఏ ఇండోర్ నెట్స్‌తో పాటు ప్రైవేట్ మైదానాల్లో ఎర్రమట్టి పిచ్‌లను అద్దెకు తీసుకుని, స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గంటల తరబడి సాధన చేశాడు. ముంబైలో వర్షాలు కురుస్తున్న సమయంలో సమయాన్ని వృథా చేయకుండా కశ్మీర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ స్టేడియానికి వెళ్లాడు. అక్కడ స్థానిక బౌలర్లు, రాష్ట్ర స్థాయి ఆటగాళ్లతో రోజులు తరబడి నెట్ ప్రాక్టీస్ చేశాడు. మధ్యలో గాయం అయినా కోలుకొని 2025-26 రంజీ సీజన్లో 9 ఇన్నింగ్స్‌ల్లో 53.62 సగటుతో 429 పరుగులు సాధించాడు. అయినా లంక టూర్‌కు సెలెక్టర్లు ముందుగా అతడిని పట్టించుకోలేదు.
‘చీకటి పోయాక సూర్యుడు తప్పక ఉదయిస్తాడు.. కష్టపడే తత్వానికి ఎప్పటికైనా అదృష్టం తోడవుతుంది’ అని తండ్రి నౌషద్ కవిత చెప్పినట్టు.. సుదర్శన్ గాయం రూపంలో సర్ఫూకు కొంత అదృష్టం తోడైంది. సుదర్శన్ దూరమవ్వడంతో సెలెక్టర్ల ముందు రుతురాజ్ గైక్వాడ్, షేక్ రషీద్ పేర్లు కూడా పరిశీలనకు వచ్చాయి. అయితే లంకలోని గాలే, కొలంబో పిచ్‌లపై స్పిన్ బౌలింగ్ ప్రధాన పాత్ర పోషించనుంది. ప్రస్తుత భారత జట్టులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ తర్వాత స్పిన్‌ను అత్యంత సమర్థవంతంగా ఆడే బ్యాటర్ సర్ఫూనే కావడం అతడికి కలిసొచ్చింది. మరోవైపు బ్యాకప్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఇటీవల స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో వరుసగా విఫలమవుతున్నాడు.
లంక ఎలెవన్‌తో వామప్ మ్యాచ్‌లోనూ జురెల్ ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లలో మంచి ప్రావీణ్యం ఉన్న సర్ఫరాజ్‌ను సెలెక్టర్లు ఈసారి కాదనలేకపోయారు. సుదర్శన్ స్థానంలో మూడో నంబర్లో వామప్ మ్యాచ్ సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్‌కు తుది జట్టులో చోటు ఖాయమైనా.. మిడిలార్డర్లో సర్ఫూకు చాన్స్ రావొచ్చు. తన దూకుడైన బ్యాటింగ్‌తో లంక స్పిన్నర్లకు కౌంటర్ ఇచ్చేందుకు సర్ఫరాజ్ సిద్ధమయ్యాడు. 28 ఏండ్ల వయసులో ఎంతో కష్టపడి సాధించుకున్న ఈ రెండో అవకాశాన్ని ఈసారి చేజార్చుకోకూడదని పట్టుదలతో ఉన్నాడు.
టీమిండియా నుంచి పిలుపు అందుకోవడమే ఆలస్యం సర్ఫరాజ్ జట్టులో చేరాడు. ఆదివారం సాయంత్రం సెలెక్టర్ల నుంచి సమాచారం అందిన వెంటనే ఈ ముంబైకర్ విమానం ఎక్కి కొలంబో చేరాడు. ఏమాత్రం సమయం వృథా చేయకుండా సోమవారం ఉదయమే పూర్తి స్థాయి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. వామప్, రన్నింగ్ డ్రిల్స్ తర్వాత ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ అతనితో కొంతసేపు ఫీల్డింగ్ సాధన చేయించాడు. అనంతరం నెట్స్‌కు వెళ్లిన సర్ఫూ బ్యాటింగ్ కోచ్ సితాన్షు పర్యవేక్షణలో రెండున్నర గంటల పాటు త్రో డౌన్స్ ఎదుర్కొన్నాడు.
మరోవైపు లంక ఎలెవన్‌తో వామప్ ఆడిన ఎన్సీసీ మైదానం మెయిన్ వికెట్‌పై టీమిండియా ప్రధాన బ్యాటర్లంతా ప్రాక్టీస్ చేశారు. గాలె టెస్టులో స్పిన్ సవాల్ ఎదురవనున్న నేపథ్యంలో మూడు రోజుల మ్యాచ్ తర్వాత పగుళ్లు ఏర్పడిన ఎన్సీసీ పిచ్‌పై స్పిన్నర్లను ఎదుర్కొన్నారు. చివర్లో సర్ఫరాజ్, జడేజా కూడా సెంటర్ పిచ్‌పై హర్ష్ దూబే, తనుష్ కోటియన్, శివంగ్ కుమార్ స్పిన్ బౌలింగ్‌లో సాధన చేశారు.