కోరుట్ల, మే 27: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పోయిందని, అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు. కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం కోరుట్ల మండల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు.
అడ్డగోలు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్, తన చేతగాని పాలనతో అపహస్యం పాలైందన్నారు. ప్రభుత్వ అరాచక పాలనతో సొంత పార్టీ నాయకులే ఇబ్బందులు పడుతున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రత్యేక పాలసీతో రాష్ర్టాన్ని ముందుకు నడిపించిన విషయాన్ని గుర్తు చేశారు. మిస్ వరల్డ్ పోటీల్లో కాంగ్రెస్ నాయకుల చేష్టలతో తెలంగాణకు మచ్చతెచ్చేలా వ్యవహరించారన్నారు.
ఈ సీజన్లో మత్స్యకారులకు చేప పిల్లలు మంజూరు చేయలేదని, జనుము, జీలుగ విత్తనాలు, ఎరువులు సరిపడా అందించలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కుమ్మకై అరాచక పాలనకు తెర తీశాని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త నిబద్ధతతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఇక్కడ జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు చీటి వెంకట్రావు, పార్టీ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, మాజీ ఎంపీపీ తోట నారాయణ తదితరులు పాల్గొన్నారు.
మరో మూడేళ్లు ఓపిక పడదాం. వచ్చేది మన ప్రభుత్వమే. పార్టీలో పదవులు అనుభవించి బయటకు వెళ్లిన నాయకులకు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుదాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవుల కోసం కీచులాడుకోవద్దు. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తాం. గెలుపే లక్ష్యంగా సమష్టిగా కృషి చేసి విజయాన్ని సొంతం చేసుకుందాం. పార్టీ కోసం అంకితభావంతో పని చేసే కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది.
– విద్యాసాగర్‌రావు, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు