MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల, డిసెంబర్ 5: పాడి రైతులకు, పశు పోషకులకు మరిన్ని అధునాతన సేవలు అందించేందుకు పశు వైద్య కళాశాలలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. పట్టణ శివారులోని మెట్ పల్లి రోడ్డు లో ఉన్న పీవీ నరసింహారావు పశు వైద్య కళాశాలను ఎమ్మెల్యే శుక్రవారం సందర్శించారు.
ఈ సందర్భంగా పశు వైద్య కళాశాలలోని పలు విభాగాలను ఆయన పరిశీలించారు. పశు వైద్య సేవలు, ల్యాబ్ సదుపాయాలు, చికిత్స విధానాలు, ఆధునిక పరికరాల వినియోగంపై కళాశాల అధ్యాపకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు వైద్య విద్యార్థులను కలిసి మాట్లాడారు. విద్యాభ్యాసం, ప్రాక్టికల్ ట్రైనింగ్, ఫీల్డ్ అనుభవం, పశు వైద్య నైపుణ్యాలను గూర్చి ఆరా తీశారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్యాకల్టికి సూచించారు. పాడి రైతులకు మరిన్ని విస్తృతమైన సేవలు అందించేందుకు వెటర్నరీ కళాశాలను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. పశు పశుసంవర్ధక రంగం పురోభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.