Kayakalp Award | కోరుట్ల, జూలై 11: జాతీయ ఆరోగ్య మిషన్, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో అండజేసే కాయకల్ప అవార్డుకు కోరుట్ల ప్రభుత్వ వంద పడకల ఏరియా ఆసుపత్రి ఎంపికైంది. ఉత్తమ వైద్య సేవలతోపాటు శుచి, శుభ్రతలో ఉత్తమ ప్రమాణాలు పాటించే దవాఖానలకు ఈ అవార్డును అందజేస్తారు. శుచి, శుభ్రతలో 2024-25వ సంవత్సరంలో కోరుట్ల ఏరియా ఆసుపత్రి 86.92 శాతం ప్రమాణాలు సాధించి 11వ స్థానాన్ని దక్కించుకుంది.
దవాఖానలోని స్వచ్ఛత, రోగులకు, వారి అటెండెంట్లకు అందుతున్న సదుపాయాలు, బయో మెడికల్ వేస్టేజ్ నిర్వహణ, ఇన్ఫెక్షన్ సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు, పారిశుధ్యం, రికార్డుల నమోదు, సిబ్బంది పనితీరు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని జాతీయ ఆరోగ్య మిషన్ బృందం స్కోరింగ్ ఇస్తుంది. ఈ అంశాల్లో కోరుట్ల ఏరియా ఆసుపత్రి రాష్ట్రంలోనే 11వ స్థానంలో నిలవడం సంతోషంగా ఉన్నదని దవాఖాన సూపరింటెండెంట్ సునీతరాణి హర్షం వ్యక్తంచేశారు. కాయకల్ప ఆవార్డులో 11వ స్థానంలో నిలిచిన దవాఖానకు అభివృద్ధి కోసం రూ. లక్ష పారితోషికంతో పాటూ ప్రశాంస పత్రం అందనున్నట్లు ఆమె తెలిపారు.