కరీంనగర్ : గోదావరిని ఎడారిగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించి గోదావరిని నిండుకుండలా మార్చాలని లేకపోతే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామని మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్(Korukanti Chander) అన్నారు. గోదావరిఖని నుంచి చేపడుతున్న పాదయాత్ర బుధవారం కరీంనగర్ఖు చేరుకోగా బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలతో కాళేశ్వరం కూలిపోయిందంటూ ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు.
గత 15 నెలలుగా గోదావరి ఎండిపోయి రైతులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టును విస్మరించి తాగునీరు, సాగునీరు అందకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ మీద ఉన్న కోపాన్ని ప్రజలపై చూపించవద్దని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉన్న పరిస్థితులు ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్న సంకల్పంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి గోదావరి నిండుకుండగా మార్చారని తెలిపారు.
కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధ్వాన చర్యల వల్ల ప్రజలు నీటి కోసం తిప్పలు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా వెంటనే కాంగ్రెస్ చర్యలు చేపట్టాలని లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. తమ పాదయాత్రలో ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చెల్లా హరిశంకర్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.