సుల్తానాబాద్, డిసెంబర్ 6 : ఉద్యమాలు తమకు అలవాటేనని, కేసులకు ఏమాత్రం భయపడేది లేదని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం గురుకుల విద్యార్థులకు శాపంగా మారిందని, వారి సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తే పోలీసులు కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడెంట్ కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం సుల్తానాబాద్‌లోని గురుకుల పాఠశాలలను విద్యార్థి నాయకులు సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలో పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
ఎలాంటి ఆందోళనలు చేయకున్నా తమను అరెస్ట్ చేయడం హాస్యాస్పదంగా ఉందని విద్యార్థి నాయకులు విమర్శించారు. తమ వద్ద ఉన్న ఫోన్లు స్వాధీనం చేసుకుని, డాటాను డిలీట్ చేశారని ఆరోపించారు. అరెస్ట్ విషయం తెలుసుకున్న కోరుకంటి చందర్ సుల్తానాబాద్‌కు చేరుకుని విద్యార్థి నాయకులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని మండిపడ్డారు. గురుకులాల్లో సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాలను కొనసాగిస్తామన్నారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్ ఉన్నారు. గురుకుల బడిబాట జిల్లా ఇన్చార్జి చుక్క శ్రీనివాస్, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు రాజోజుల శివ, నాయిని అన్వేశ్, అయితు సాయిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రావణ్‌కుమార్ తెలిపారు.