ధర్మపురి రూరల్, మే 24 : ధాన్యం కొనుగోళ్లలో నెలల తరబడి జాప్యం చేస్తుండడంతో రైతులను తీరని నష్టం వస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మపురి మండలం జైన, దొంతాపూర్, మగ్గిడిఎడపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని శనివారం ఆయన పరిశీలించగా, రైతులు తడిసిన ధాన్యాన్ని ఆయనకు చూపిస్తూ తమను అనేకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు.
ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ ధాన్యం వేగంగా కొంటున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎక్కడా సమర్ధవంతంగా జరగడం లేదని విమర్శించారు. ఫలితంగా అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వచ్చాయన్నారు. మరో వైపు తూకం వేసిన బస్తాల నిల్వలు అలాగే ఉన్నాయనీ, లారీల కోసం రైతులు ఎదురుచూస్తున్నారన్నారు.
తూకం వేసినప్పుడే ఆరు కిలోలు కట్ చేస్తున్నారనీ, ఇప్పుడు ధాన్యం తడిసిన తర్వాత మిల్లర్లు మళ్లీ కట్ చేస్తారనీ, దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. కేసీఆర్ పాలనలో తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సివిల్ సైప్లె అధికారులతో ఫోన్లో మాట్లాడి, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సౌళ్ల భీమయ్య, అయ్యోరి రాజేశ్‌కుమార్, చీర్నేని నర్సయ్య, కుడిక్యాల మహేశ్, దుర్గం రవీందర్ తదితరులున్నారు.