జగిత్యాల, డిసెంబర్ 5 : రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. హామీలు నెరవేర్చాలని ప్రశ్నిస్తే అరెస్ట్‌లు చేస్తారా..? అని నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్‌లను ఖండించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధే ధ్యేయంగా సుపరిపాలన అందించారని గుర్తు చేశారు. అప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో స్నేహపూర్వక వాతావరణం వుండేదని, ఇప్పుడు పోలీస్‌లను ముందు పెట్టుకొని ప్రభుత్వం అక్రమ అరెస్ట్‌లు చేయిస్తున్నదని దుయ్యబట్టారు.
ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపైనే కేసు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. హరీశ్‌రావు, కేటీఆర్‌పై కేసులు పెట్టాలని చూస్తున్నారన్నారు. గురుకుల పాఠశాలలో భోజనం బాగాలేదని విద్యార్థులు ఆందోళన చేస్తే, దీని వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందనడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యార్థులకు మద్దతుగా గురుకులాలకు వెళ్తే తమను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని, మంచి పరిపాలన అందించి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని హితవుపలికారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, ఇప్పుడు తెలంగాణాలో ఎమర్జెన్సీ తలపిస్తున్నదని, మాట్లాడితే అరెస్ట్‌లు చేస్తున్నారని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఝూటా మాటలతో ప్రజలను నమ్మిస్తున్నాడని విమర్శించారు. పిచ్చి మాటలు బంద్ చేసి మంచి పాలన అందించాలని హితవు పలికారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, మాజీమంత్రి హరీశ్ రావుపై, జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టడాన్ని బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దావ వసంత మాట్లాడుతూ, ప్రజాపాలన అని చెప్పి ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన చేస్తున్నారని ఆగ్రహించారు. గురుకుల విద్యార్థులకు సరిగ్గా అన్నం పెట్టని మీరు విజయోత్సవాలు దేనికి చేసుకుంటున్నారని నిలదీశారు. ఆడవాళ్లను కోటిశ్వరులను చేస్తామంటున్నారని, ముందుగా కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం, విద్యార్థినులకు సూటీ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో హరిచరణ్ రావు, లోక బాపు రెడ్డి, గోసుల జలందర్, మాధవ రావు, వొళ్లెం మల్లేశం, గంగారెడ్డి పాల్గొన్నారు.