రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని1 టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు, బీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలతో శవయాత్ర చేసి, దహనం చేశారు. గన్నేరువరంలో ఆయన చిత్రపటానికి పిండ ప్రదానం చేశారు. ‘ఖబడ్దార్ రేవంత్’ అంటూ నినాదాలు చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కాగా, కరీంనగర్లో జరిగిన నిరసనలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొనగా, రేవంత్ వ్యాఖ్యలను మరో మంత్రి కొప్పుల తీవ్రంగా ఖండించారు. ‘ఖబడ్దార్ రేవంత్‌రెడ్డి.. రైతుల తెరువు వస్తే ఊరుకోం’ అంటూ హెచ్చరించారు.
– కరీంనగర్, జూలై 11 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : ఎకరం పొలం పారించేందుకు గంట కరెంట్ చాలని, మూడు ఎకరాలు పారాలంటే మూడు గంటలు చాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. అధికార బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులతో కలిసి రోడ్లెక్కి నిరసన తెలిపారు. ఖబడ్దార్ రేవంత్‌రెడ్డి.. రైతుల తెరువుకు వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తుంటే కాంగ్రెస్ కళ్లు మండుతున్నాయని, రైతులు బాగుపడుతుంటే ఆ పార్టీ నాయకులు ఓర్చుకోలేక పోతున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. కరెంట్ అడిగినందుకు గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు రైతులను చంపించిన ఉదంతాలను గుర్తు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సాగు నీరు, నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న నేపథ్యంలోనే రైతులు మంచి పంటలు పండిస్తూ సుఖ సంతోషాలతో ఉన్నారని స్పష్టం చేస్తున్నారు.
నేడు రేవంత్ దిష్టిబొమ్మల దహనాలు, శవయాత్రలు
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్న బీఆర్ఎస్ నిరసనలు తీవ్రతరం చేసేందుకు మూడు రోజుల కార్యాచరణ సిద్ధం చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బుధవారం జిల్లాల్లోని అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించనుంది. రేవంత్ దిష్టి బొమ్మలు దహనం చేయడంతో పాటు శవయాత్రలు నిర్వహించనున్నది. ఆయా మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని, అన్ని రైతు వేదికల్లో తీర్మానం చేయనున్నాయి. అలాగే, అన్ని విద్యుత్ ఉప కేంద్రాల ముందు రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మలను ఉరితీయడం, వేలాడ దీయడం వంటి నిరసన కార్యక్రమాలు వరుసగా మూడు రోజుల పాటు నిర్వహిస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ప్రకటించారు.
కరీంనగర్‌లోని తెలంగాణచౌక్‌లో రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మకు ఉరి తీశారు. ఇక్కడ రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై సునీల్‌రావుతోపాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. గన్నేరువరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుల ఆధ్వర్యంలో పిండ ప్రదానం చేశారు. హుజూరాబాద్ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి, రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. మరో పక్క మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తన మాటల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రామడుగు మండలం వెదిర గ్రామంలోని ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని టెక్స్టైల్ పార్క్ ప్రధాన గేటు ఎదుట బీఆర్ఎస్వై జిల్లా నేత సిలువేరి చిరంజీవి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇక్కడ జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కొప్పుల ఉచిత విద్యుత్ విషయంలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తా, అంతర్గాం మండలకేంద్రంలోని చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రేంవత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పాతబస్టాండ్ వద్ద, కొడిమ్యాల, మల్యాల మండల కేంద్రాల్లో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు.
రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్‌దే
తెలంగాణలో ఉచిత విద్యుత్‌ను రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నది. వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర ఆ పార్టీది. ‘తెలంగాణ రైతులకు 24 గంటల ఉచిత కరెంటు దండగ’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయనకు ఎంత ధైర్యం. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని అర్థమైపోతున్నది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు హుజూరాబాద్ నియోజకవర్గంలోని 106 గ్రామపంచాయతీలు, రెండు మున్సిపాలిటీల్లో బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. ఆ పార్టీ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలి.
– పాడి కౌశిక్‌రెడ్డి, మండలి విప్ (హుజూరాబాద్‌టౌన్)
రేవంత్ క్షమాపణ చెప్పాలి
తెలంగాణ రైతులకు 24 గంటల ఉచిత కరెంటు దండుగని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి మాట్లాడడం దుర్మార్గం. రైతులంటే అంత వివక్షనా..? ముందు నుంచీ కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక పార్టీ. తెలంగాణలో ఎన్నోఏండ్లు అధికారంలో ఉండి కూడా రైతుల కోసం ఏ ఒక్క మంచి పనీ చేయలేదు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించి, రైతును రాజు చేయాలనే సంకల్పంతో దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలను అమలు చేస్తూ, ఇంకా అహోరాత్రులు శ్రమించి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నరు. రైతులంటే ఎందుకంత కండ్లమంట? రైతులపై రేవంత్‌రెడ్డికి ఇసుమంతైనా ప్రేమ ఉంటే అలా మాట్లాడడు. మరీ ఇంత ద్వేషమా..? కాంగ్రెస్ విధానమే రైతు వ్యతిరేకమని మరోసారి రుజువైంది. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలి.
– అనిల్ కూర్మాచలం, ఎఫ్డీసీ చైర్మన్, ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు (కరీంనగర్ కార్పొరేషన్ )
కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా వ్యవహరిస్తుంటే కాంగ్రెస్ నేతలు ఓర్వడం లేదు. రైతులపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. దేశం విడిచిపోగానే తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం వారి కపట బుద్ధికి నిదర్శనం. రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలి. రైతులతో పెట్టుకున్న వాళ్లకు డిపాజిట్లు కూడా రావు. రైతులను వ్యతిరేకించే కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలి.
– బండ శ్రీనివాస్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్
అవమానించేలా మాట్లాడడం సరికాదు
కేసీఆర్ రాష్ట్రంలో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి రేవంత్ రెడ్డి ఓర్వలేకపోతున్నడు. అందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నడు. రైతులను అవమానించేలా మాట్లాడడం ఏ మాత్రం సరికాదు. రైతులపై కాంగ్రెస్ పార్టీకి ఎంత చిత్త శుద్ధి ఉందో ఈ మాటలను చూస్తేనే అర్థమవుతున్నది. రేవంత్ రెడ్డి వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలి.
– గడ్డం చుకారెడ్డి, మారెట్ కమిటీ చైర్మన్ (చొప్పదండి)
అది దుర్గార్మమైన ఆలోచన
రేవంత్‌రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ వద్దనడం సిగ్గుచేటు. అది దుర్గార్మమైన ఆలోచన. గతంలో రైతులను నట్టేట ముంచింది కాంగ్రెస్. నాట్ల సీజన్లో కరంటు బిల్లులు కట్టకుంటే మోటర్ల స్టాటర్లు తీసుకెళ్లిన ఘనత ఆ ప్రభుత్వానికే దక్కింది. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విత్తనాలకు, ఎరువులకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రోజులను ఇంకా మరిచిపోలేదు. రేవంత్‌రెడ్డి మరోసారి రైతుల గురించి మాట్లాడితే సహించేది లేదు. రేవంత్‌రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి.
– ఎడవెల్లి కోండాల్రెడ్డి, హుజూరాబాద్ సింగిల్ విండో చైర్మన్ (హుజూరాబాద్ రూరల్)